ముంబై: భారత్‌లో కరోనా కేసులు అధికమవడం కారణంగా అర్ధంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్ 2021 సీజన్‌ను యూఏఈ వేదికగా సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 10 మధ్యలో నిర్వహించాలని బీసీసీఐ శత విధాల ప్రయత్నిస్తుంది. ఇందు కోసం కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) షెడ్యూల్‌ను వారం నుంచి పది రోజులు ముందుకు జరపాలని క్రికెట్ వెస్టిండీస్‌తో సంప్రదింపులకు సమాయత్తమవుతోంది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం సీపీఎల్ ఆగస్టు 28న ప్రారంభమై సెప్టెంబర్ 19న ముగుస్తుంది. ఇదే జరిగితే సీపీఎల్‌లో పాల్గొనే ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడేందుకు బయో బబుల్ ఇబ్బందులు తలెత్తడంతో పాటు లీగ్‌లోని కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.
దీంతో రెండు లీగ్‌ల మధ్య క్లాష్ జరగకుండా, సీపీఎల్‌ను ప్రీపోన్ చేసుకోవాలని బీసీసీఐ వెస్టిండీస్ క్రికెట్ బోర్డును కోరనుంది. ఇప్పటికే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు వివిధ కారణాల చేత ఐపీఎల్‌లో ఆడేది అనుమానంగా మారిన నేపథ్యంలో బీసీసీఐ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోను ఒప్పందం కుదుర్చుకున్న అందరు విదేశీ ఆటగాళ్లతో లీగ్‌ను నిర్వహించాలని బీసీసీఐ పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఐపీఎల్ సెకండాఫ్ జరుగుతున్న సమయంలో ఏ కారణం చేత కూడా విదేశీ ఆటగాళ్లు దూరం కాకుండా ఆయా బోర్డులతో బీసీసీఐ చర్చలు ప్రారంభించింది.
చదవండి: ధోని లాంటి ఫినిషర్ లేకపోతే ఎంత మేటి జట్టైనా ఏం ప్రయోజనం..?
Comments
Please login to add a commentAdd a comment