చరిత్ర సృష్టించిన బెన్‌ స్టోక్స్‌.. ప్రపంచంలోనే రెండో క్రికెటర్‌గా.. | Ben Stokes Sets All-Time Record Upstages ABD, Kapil Dev Topped By Viv Richards | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన బెన్‌ స్టోక్స్‌.. ప్రపంచంలోనే రెండో క్రికెటర్‌గా..

Published Thu, Sep 14 2023 10:23 AM | Last Updated on Thu, Sep 14 2023 11:41 AM

Ben Stokes All Time Record Upstages ABD Kapil Dev Topped By Viv Richards - Sakshi

రికార్డుల బెన్‌ స్టోక్స్‌

England vs New Zealand Ben Stokes Record: ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో విధ్వంసకర శతకంతో చెలరేగి పలు అరుదైన ఘనతలు సాధించాడు. కాగా వరల్డ్‌కప్‌-2023 నేపథ్యంలో 50 ఓవర్ల ఫార్మాట్‌లో రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న స్టోక్స్‌ రీఎంట్రీలో తొలిసారి బ్యాట్‌ ఝులిపించాడు.

నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కివీస్‌తో తొలి వన్డేతో పునరాగమనం చేసిన స్టోక్స్‌ 52 పరుగులతో రాణించాడు. అయితే, తదుపరి మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక్క పరుగు తీసి అవుటయ్యాడు. ఈ క్రమంలో.. మూడో వన్డేలో సిక్సర్ల వర్షం కురిపిస్తూ సుడిగాలి ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.

సంచలన ఇన్నింగ్స్‌తో
నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 124 బంతుల్లో 15 ఫోర్లు, 9 సిక్సర్లతో 182 పరుగులు సాధించాడు. తద్వారా వన్డేల్లో నాలుగో సెంచరీ చేసిన స్టోక్సీ.. ఈ ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. 

ఆ రికార్డులు బద్దలు.. ప్రపంచంలో రెండో క్రికెటర్‌గా
ఈ క్రమంలో జేసన్‌ రాయ్‌ (180; 2018లో ఆస్ట్రేలియాపై) పేరిట ఉన్న ఈ రికార్డును స్టోక్స్‌ బద్దలు కొట్టాడు. అదే విధంగా.. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నాలుగు లేదంటే ఆ తర్వాతి స్థానంలో వచ్చి వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన రెండో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. 

తద్వారా వెస్టిండీస్‌ దిగ్గజం సర్‌ వివియన్‌ రిచర్డ్స్ తర్వాత ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో రాస్‌ టేలర్‌, ఏబీ డివిలియర్స్‌, టీమిండియా లెజెండ్‌ కపిల్‌ దేవ్‌లను అధిగమించాడు.

వన్డేల్లో నాలుగు లేదంటే ఆ తర్వాతి స్థానాల్లో వచ్చి అత్యధిక పరుగులు సాధించిన టాప్‌-5 క్రికెటర్లు వీరే!
►వివియన్‌ రిచర్డ్స్‌- 189
►బెన్‌ స్టోక్స్‌- 182
►వివియర్‌ రిచర్డ్స్‌- 181
►రాస్‌ టేలర్‌- 181
►ఏబీ డివిలియర్స్‌- 176
►కపిల్‌ దేవ్‌- 175

ఒక్క రన్‌తో ధోని, కోహ్లి రికార్డు మిస్‌
కివీస్‌పై ఇన్నింగ్స్‌(182)తో.. వన్డేల్లో నాన్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగి అత్యధిక స్కోరు సాధించిన ఆరో ఆటగాడిగా స్టోక్స్‌ నిలిచాడు. చార్ల్స్‌ కొవంట్రీ(194), వివియన్‌ రిచర్డ్స్‌(189), ఫాఫ్‌ డుప్లెసిస్‌(185), మహేంద్ర సింగ్‌ ధోని(183), విరాట్‌ కోహ్లి(183) ఈ జాబితాలో స్టోక్స్‌ కంటే ముందున్నారు.  ఇదిలా ఉంటే మూడో వన్డేలో ఇంగ్లండ్‌ 181 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించి 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.

చదవండి: Asia Cup: ఫైనల్లో భారత్‌ వర్సెస్‌ పాక్‌ లేనట్లే! మూటాముల్లె సర్దుకోండి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement