ఇండోర్‌లో హోల్కర్ క్రికెట్ స్టేడియం వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మూడోటెస్టు బుధవారం మొదలుకానుంది. ఇప్పటికే నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియా 2-0తో ఆధిక్యంలో ఉంది. తొలి రెండు టెస్టులు యాదృశ్చికంగా రెండున్నర రోజుల్లోనే ముగియడం గమనార్హం. క్యురేటర్లు పూర్తిగా స్పిన్ పిచ్‌లను తయారు చేస్తూ బౌలర్లు.. బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టేలా చేస్తున్నారు. ఇక టీమిండియా స్పిన్నర్లు అశ్విన్, జడేజాలు వికెట్ల పండగ చేసుకుంటున్నారు.
రెండు టెస్టుల్లోనూ ఘన విజయాలు సాధించిన టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసుకు మరింత దగ్గరైంది. మూడో టెస్టులోనూ గెలిచి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతుంది. ఈ విషయం పక్కనబెడితే తొలి రెండు టెస్టుల్లో భారత స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్న పిచ్‌లను తయారు చేశారంటూ ఆసీస్ బహిరంగంగా విమర్శలు చేసింది. అయితే ఉపఖండపు పిచ్‌లు మాములుగానే స్పిన్నర్లకు అనుకూలిస్తాయన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్నర్లే కాదు ఆసీస్ స్పిన్నర్లు టాడ్ మర్ఫీ, నాథన్ లియోన్‌లు కూడా వికెట్ల తీశారు.
ఇండోర్ పిచ్‌ను పరిశీలిస్తున్న స్టీవ్ స్మిత్
ఇక ఇండోర్ పిచ్ కూడా స్పిన్నర్లకు అనుకూలంగానే ఉంటుందని పిచ్ క్యూరేటర్ ఇప్పటికే వెల్లడించాడు. '' పిచ్‌పై కాస్త గడ్డి ఉండడంతో బ్యాటింగ్‌కు సహకరిస్తుంది. కాస్త భారీగానే పరుగులు వచ్చే అవకాశం ఉంది. అయితే గడ్డి పెరిగితే మాత్రం స్పిన్నర్లు పండగ చేసుకోవడం ఖాయం. సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో భారీ స్కోర్లు నమోదు కాలేకపోయాయని.. కానీ ఇండోర్ టెస్టులో మాత్రం పరుగులు వచ్చే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ ఐదు రోజులు కొనసాగితే చివరి రెండు రోజులు మాత్రం స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది అని వెల్లడించాడు.
అయితే వ్యక్తిగత పని నిమిత్తం స్వదేశానికి తిరిగి వెళ్లిన ఆసీసీ కెప్టెన్ పాట్ కమిన్స్ ఇంకా తిరిగి రాకపోవడంతో స్టీవ్ స్మిత్ స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. కాగా ఇండోర్ పిచ్‌ను స్మిత్ పరిశీలించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తొలి టెస్టులో కూడా వార్నర్‌తో కలిసి స్మిత్ పిచ్‌ను పరిశీలించడంపై సోషల్ మీడియాలో విపరీతమైన మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి.
తొలి టెస్టు సందర్భంగా పిచ్‌ను పరిశీలించిన వార్నర్, స్మిత్
ఇక హోల్కర్ స్టేడియంలో 2019 డిసెంబర్‌లో చివరిసారి బంగ్లాదేశ్, టీమిండియా మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఇదే వేదికలో ఇటీవలే న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్ జరగ్గా.. రోహిత్, గిల్‌లు శతకాలతో విరుచుకుపడడంతో టీమిండియా 90 పరుగులతో గెలుపొందింది.
తుది జట్టు విషయానికి వస్తే.. కేఎల్ రాహుల్‌పై వేటు పడుతుందా లేక జట్టులో కొనసాగుతాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఫామ్‌లేమితో సతమతమవుతున్న రాహుల్‌ను పక్కనబెట్టాలని పెద్ద ఎత్తున డిమాండ్స్ వస్తున్నాయి. దీంతో కేఎల్ రాహుల్ స్థానంలో శుబ్‌మన్ గిల్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది మినహా జట్టులో పెద్దగా మార్పులు లేకపోవచ్చు.
Australian captain Steve Smith checking the Indore pitch. pic.twitter.com/OvPqHoT6lm
— Johns. (@CricCrazyJohns) February 28, 2023
Comments
Please login to add a commentAdd a comment