IND Vs AUS 2nd Test Day-1 Analysis.. ఢిల్లీ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదలైన రెండో టెస్టు తొలిరోజు ఆట ముగిసింది. తొలిరోజు ఆటలో టీమిండియానే ఆధిపత్యం కనబరిచింది. స్పిన్నర్లకు అనుకూలమైన పిచ్‌లో మహ్మద్ షమీ నాలుగు వికెట్లతో చెలరేగడం చూస్తుంటే ఆస్ట్రేలియా పేసర్లకు కూడా ఫిరోజ్ షా కోట్ల మైదానంలో వికెట్లు తీసేందుకు మంచి అవకాశం ఉన్నట్లుగా అనిపిస్తుంది.
అయితే తొలి టెస్టుతో పోలిస్తే ఆసీస్ బ్యాటింగ్ కాస్త మెరుగ్గా అనిపించింది. తొలి టెస్టులో విఫలమైన ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా రెండో టెస్టులో మాత్రం తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 81 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు వార్నర్ మాత్రం తన వైఫల్యాన్ని సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నాడు. ఇక తొలి టెస్టులో పర్వాలేదనిపించిన వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాత్రం మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. అశ్విన్ స్పిన్ దెబ్బకు స్మిత్ తోకముడిచాడు.
ఆ తర్వాత పనిని జడేజా కానిచ్చాడు. ఖవాజా వికెట్‌ను ఖాతాలో వేసుకున్న జడేజా ఆఖర్లో మరో రెండు వికెట్లు దక్కించుకున్నాడు. అయితే జట్టులో మూడో స్పిన్నర్‌గా ఉన్న అక్షర్ పటేల్‌కు ఈ మ్యాచ్‌లో కూడా ఒక్క వికెట్ దక్కలేదు. ఇక తన పేస్ పదును చూపించిన షమీ మొదట వార్నర్‌ను, మధ్యలో ట్రెవిస్ హెడ్‌ను.. చివరి రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకొని మొత్తానికి తొలిరోజు హీరో అయ్యాడు.
ఇక స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుదని క్యురేటర్ పేర్కొన్నప్పటికి అలా జరగలేదు. స్పిన్నర్లు ప్రభావం చూపించినప్పటికి టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అంతకుమించి ప్రదర్శన చేశాడు. ఆస్ట్రేలియాకు రెండో టెస్టులో ఏదైనా ఓదార్పు ఉందంటే మూడు సెషన్ల పాటు బ్యాటింగ్ చేయడమే. గుడ్డిలో మెల్ల కనీసం రెండు వందల స్కోరైనా చేసంది. మరి రెండో రోజు ఆటలో ఆసీస్ పేసర్లు జూలు విధిస్తారా.. స్పిన్నర్లు ఏమైనా మ్యాజిక్ చేస్తారా అన్నది వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment