Former Indian Players Who Scored A Double Century In Border-Gavaskar Trophy - Sakshi
Sakshi News home page

BGT 2023: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు వీరే

Published Tue, Feb 7 2023 3:32 PM | Last Updated on Tue, Feb 7 2023 4:24 PM

BGT 2023:These Are The Former Indian Players Who Scored A Double Century - Sakshi

ఆస్ట్రేలియా- భారత్‌ మధ్య జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అంతా సిద్దమైంది. ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్‌ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చరిత్ర చూస్తే ఇప్పటివరకూ ఆస్ట్రేలియాపై టీమిండియానే పై సాధించింది. అదే విధంగా భారత గడ్డపై ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ విజయం సాధించి దాదాపు 19 ఏళ్లు కావస్తోంది.

చివరసారిగా భారత గడ్డపై టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియా 2004లో సొంతం చేసుకుంది. ఇక చివరి మూడుసార్లూ టీమిండియానే సిరీస్ గెలవడం విశేషం. మరోసారి ఆస్ట్రేలియాపై తమ ఆధిపత్యాన్ని చెలాయించాలని భారత జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో డబుల్ సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.

డబుల్‌ సెంచరీల వీరులు వీరే..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత మాజీ ఆటగాళ్లు వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, మహేంద్ర సింగ్ ధోనీ, గౌతమ్ గంభీర్ డబుల్ సెంచరీలు సాధించారు. ప్రస్తుత భారత జట్టులో ఛతేశ్వర్‌ పుజారా మినహా ఏ ఒక్క ఆటగాడు కూడా ఆసీస్‌పై ద్విశతకం నమోదు చేయలేదు.

వీవీఎస్ లక్ష్మణ్..
భారత దిగ్గజ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్‌కు ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ అంటే పూనకాలే. లక్ష్మణ్‌ ఆస్ట్రేలియాపై రెండు సార్లు డబుల్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు .వీవీఎస్ లక్ష్మణ్ 2001లో 281, 2008 ఢిల్లీ టెస్టులో 200 (నాటౌట్) పరుగులు చేశాడు. ఇక ఓవరాల్‌గా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 29 టెస్టులు ఆడిన  లక్ష్మణ్.. 49.67 సగటుతో 2434 పరుగుల చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 6 సెంచరీలు, 12 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

సచిన్ టెండూల్కర్
క్రికెట్‌ గాడ్‌ సచిన్ టెండూల్కర్‌కు కూడా ఆస్ట్రేలియాపై అద్భుతమైన రికార్డు ఉంది. సచిన్‌ తన కెరీర్‌లో ఆస్ట్రేలియాపై రెండు డబుల్‌ సెంచరీలు సాధించాడు. 2004లో 241 పరుగులతో ఆజేయంగా నిలిచిన మాస్టర్‌ బ్లస్టర్‌.. 2010లో 214 పరుగులు చేశాడు. ఇక ఓవరాల్‌గా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 34 టెస్టులు ఆడిన సచిన్‌.. 3262 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 9 సెంచరీలతో పాటు 16 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. కాగా ఈ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా సచినే కావడం విశేషం.

ఛతేశ్వర్‌ పుజారా.. 
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో  భారత వెటరన్‌ ఆటగాడు ఛతేశ్వర్‌ పుజారా కూడా రెండు సార్లు ద్విశతకాలతో చెలరేగాడు. ఈ ట్రోఫీలో భాగంగా 2013లో హైదరాబాద్‌ వేదికగా ఆసీస్‌తో జరిగిన టెస్టులో 204 పరుగులు చేసిన పుజారా.. 2017 రాంఛీ టెస్టులో 202 పరుగులు చేశాడు.

రాహుల్‌ ద్రవిడ్‌
ప్రస్తుత భారత హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ 2003లో బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో ఆడుతున్నప్పుడు 233 పరుగులు చేశాడు. ది వాల్ ఆఫ్ క్రికెట్ ద్రవిడ్‌ ఆసీస్‌తో  32 టెస్టులు ఆడాడు. అందులో 2 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కాగా 2003లో అడిలైడ్ ఓవల్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో ద్రవిడ్‌ తన అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. దీంతో 22 ఏళ్ల తర్వాత తొలి సారిగా ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి భారత్‌ టెస్టు విజయం సాధించింది.

గౌతం గంభీర్‌
2008లో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ టెస్టులో గంభీర్‌ 206 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇదే మ్యాచ్‌లో వీవీఎస్ లక్ష్మణ్ ద్విశతకం సాధించడం విశేషం. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 9 టెస్టులు ఆడిన గౌతీ 673 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు, రెండు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.
 
మహేంద్ర సింగ్ ధోని 
2013లో చెన్నై వేదికగా జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అప్పటి కెప్టెన్‌గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని 224 పరుగులు సాధించాడు. ఇ‍క మొత్తంగా ఆస్ట్రేలియాపై 19 టెస్టులు ఆడిన ధోని 990 పరుగులు చేశాడు. ఒక సెంచరీతో పాటు ఐదు అర్ధ శతకాలు ఉన్నాయి.
చదవండి: IND vs AUS: భారత్‌ గెలవాలంటే.. రాహుల్‌ ఓపెనర్‌గా వద్దు! అతడే సరైనోడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement