బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)కి ముందు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత్-‘ఎ’ జట్టు పూర్తిగా నిరాశపరిచింది. బౌలర్లు మెరుగ్గానే రాణించినా.. బ్యాటర్ల వైఫల్యం కారణంగా ఆసీస్-‘ఎ’ చేతిలో చిత్తుగా ఓడింది. రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది.
వారు ముందుగానే ఆస్ట్రేలియాకు
కాగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బీజీటీలో భాగంగా టీమిండియా ఐదు టెస్టులు ఆడనుంది. ఇందులో కనీసం నాలుగు గెలిస్తేనే రోహిత్ సేనకు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. ఇలాంటి తరుణంలో బీజీటీకి ఎంపికైన అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ కృష్ణ, నితీశ్ కుమార్ రెడ్డి తదితరులను బీసీసీఐ ముందుగానే ఆస్ట్రేలియాకు పంపింది.
రాహుల్‌తో పాటు జురెల్ కూడా
రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని భారత్-‘ఎ’ జట్టుకు కూడా వీరిని ఎంపిక చేసింది. కంగారూ గడ్డపై పిచ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా.. సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌ను సైతం భారత్-‘ఎ’ రెండో టెస్టుకు అందుబాటులో ఉండేలా అక్కడకు పంపింది.
సానుకూలాంశాలు ఆ రెండే
అయితే, ఆసీస్-‘ఎ’తో రెండు అనధికారిక టెస్టుల్లో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. తొలి టెస్టులో ఏడు, రెండో మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయి సిరీస్‌ను కోల్పోయింది.
ఇక ఈ రెండు మ్యాచ్‌లలో సానుకూలాంశాలు ఏమైనా ఉన్నాయా అంటే.. మొదటి టెస్టులో సాయి సుదర్శన్ శతకం(103).. రెండో టెస్టులో ధ్రువ్ జురెల్ అద్భుత హాఫ్ సెంచరీలు(80, 68).
వరుసగా నాలుగు సెంచరీలతో సత్తా చాటి
ఇక ఈ సిరీస్‌లో అత్యంత నిరాశపరిచింది ఎవరంటే మాత్రం అభిమన్యు ఈశ్వరన్, కేఎల్ రాహుల్(4, 10). రాహుల్ సంగతి పక్కన పెడితే.. అభిమన్యుపైనే ఈ సిరీస్ ప్రభావం గట్టిగా పడనుంది.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇటీవల వరుసగా నాలుగు సెంచరీలు బాదిన ఈ బెంగాల్ బ్యాటర్‌ను సెలక్టర్లు ఆస్ట్రేలియాతో బీజీటీ ఆడబోయే జట్టుకు ఎంపిక చేశారు.
రోహిత్ స్థానంలో ఆడించాలనే యోచన.. కానీ
తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేడన్న వార్తల నడుమ.. అభిమన్యునే యశస్వి జైస్వాల్‌తో ఓపెనర్‌గా దించుతారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ.. ఆసీస్-‘ఎ’ జట్టుతో మ్యాచ్‌లలోనే అభిమన్యు తీవ్రంగా నిరాశపరిచాడు.
దీంతో బీసీసీఐ తమ ప్రణాళికలను మార్చుకుంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు.
అతడు ఫెయిల్ అయినా ఓపెనర్‌గానే
ఆసీస్-‘ఎ’తో మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ అభిమన్యు ఈశ్వరన్ బీజీటీ మొదటి టెస్టులో టీమిండియా ఓపెనర్‌గా దిగే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఆసీస్- ‘ఎ’ జట్టుతో రెండో టెస్టులో భారత బ్యాటర్ల వైఫల్యాన్ని విమర్శిస్తూ.. ‘‘మరోసారి మనవాళ్లు ఫెయిల్ అయ్యారు. అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్.. అంతా చేతులెత్తేశారు
నిజానికి ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు ఆటగాళ్లను సన్నద్ధం చేయడానికి బీసీసీఐ వాళ్లను అక్కడికి పంపింది. కానీ.. వాళ్లు పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డారు. అయితే, ఈ సిరీస్‌లో అభిమన్యు ఈశ్వరన్ విఫలమైనా.. అతడు బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లలో మాత్రం ఓపెనింగ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
దారుణంగా విఫలం
ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఆసీస్-‘ఎ’తో సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లో అభిమన్యు చేసిన పరుగులు వరుసగా.. 7, 12, 0, 17. ఇదిలా ఉంటే.. నవంబరు 22 నుంచి ఆసీస్- టీమిండియా మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.
చదవండి: IND vs SA: సంజూతో గొడవ పడ్డ సౌతాఫ్రికా ప్లేయర్.. ఇచ్చిపడేసిన సూర్య! వీడియో
Comments
Please login to add a commentAdd a comment