
వన్డే వరల్డ్‌కప్‌కు ముందు శ్రీలంక జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు వనిందు హసరంగ గాయం కారణంగా వరల్డ్‌కప్ మొత్తానికి దూరమయ్యాడు. వరల్డ్‌కప్‌కు ముందు శ్రీలంక నిర్వహించిన శిక్షణా శిబిరంలో పాల్గొన్న హసరంగ హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరికి గురయ్యాడు. ఇదే గాయం కారణంగా హసరంగ ఆసియా కప్ 2023కు దురమయ్యాడు. పాత గాయం నుంచి కోలుకునే సమయంలో మరోసారి అది తిరగబెట్టడంతో లంక స్టార్ స్పిన్నర్ వరల్డ్‌కప్ ఆడే సువర్ణావకాశాన్ని మిస్ చేసుకున్నాడు.
ఈ గాయం కారణంగా హసరంగ సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. హసరంగ గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని డాక్టర్లు అన్నారు. మరోవైపు హసరంగతో పాటు మరో లంక ఆటగాడు కూడా వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడు. ఫాస్ట్ బౌలర్ దుష్మంత్ చమీరా గాయం కారణంగా మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇదే గాయం కారణంగా వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌తో పాటు ఆసియాకప్‌కు దూరమైన చమీరా.. ఇప్పుడు మెగా టోర్నీ అవకాశాన్ని కూడా మిస్ చేసుకున్నాడు.
కాగా, వరల్డ్‌కప్ కోసం భారత్ సహా 8 జట్లు తమతమ జట్లను ప్రకటించగా.. శ్రీలంక, బంగ్లాదేశ్‌లు మాత్రం ఇంకా ప్రకటించలేదు. జట్ల ప్రకటనకు ఆఖరి తేదీ సెప్టెంబర్ 28 కావడంతో లంక క్రికెట్ బోర్డు వేచి చూసే ధోరణిని ప్రదర్శిస్తుంది. వరల్డ్‌కప్‌లో హసరంగ లేకపోవడం శ్రీలంక విజయావకాశాలను భారీగా దెబ్బతీస్తుంది. హసరంగకు రీప్లేస్‌మెంట్‌గా ఎవరిని ఎంపిక చేస్తారో వేచి చూడాలి.
ఇదిలా ఉంటే, వన్డే వరల్డ్‌కప్ 2023 భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్-గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడుతుంది. టీమిండియా తమ చిరకాల ప్రత్యర్ధి పాక్‌ను అక్టోబర్ 14న నరేంద్ర మోదీ స్టేడియంలో ఢీకొంటుంది. నవంబర్ 19న జరిగే ఫైనల్‌తో మెగా టోర్నీ ముగుస్తుంది.