హ్యాట్రిక్‌ సాధించిన ఆస్ట్రేలియా బౌలర్‌ | Brody Couch Picks Up First Ever Hat Trick For Western Australia In Sheffield Shield | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్‌ సాధించిన ఆస్ట్రేలియా బౌలర్‌

Published Mon, Nov 4 2024 8:41 PM | Last Updated on Mon, Nov 4 2024 8:42 PM

Brody Couch Picks Up First Ever Hat Trick For Western Australia In Sheffield Shield

ఆస్ట్రేలియాలో జరిగే షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో హ్యాట్రిక్‌ నమోదైంది. టస్మానియాతో జరిగిన మ్యాచ్‌లో వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా బౌలర్‌ బ్రాడీ కౌచ్‌ హ్యాట్రిక్‌ వికెట్లతో విరుచుకుపడ్డాడు. కౌచ్‌ హ్యాట్రిక్‌ వికెట్లతో చెలరేగడంతో టస్మానియాపై వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 45 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టస్మానియా తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగులకు ఆలౌటైంది. కాలెబ్‌ జువెల్‌ (61), మిచెల్‌ ఓవెన్‌ (83) అర్ద సెంచరీలతో రాణించారు. వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా బౌలర్లలో జోయెల్‌ పారిస్‌ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.

అనంతరం బరిలోకి దిగిన వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో కార్ట్‌రైట్‌ భారీ సెంచరీతో (153) సత్తా చాటగా.. సామ్‌ ఫాన్నింగ్‌ (68), గుడ్విన్‌ (94), ఆస్టన్‌ అగర్‌ (74) అర్ద సెంచరీలతో రాణించారు. టస్మానియా బౌలర్లలో కున్హేమన్‌ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.

143 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టస్మానియా.. బ్రాడీ కౌచ్‌ (14-8-15-3), అస్టన్‌ అగర్‌ (17.5-11-12-3), జోయెల్‌ పారిస్‌ (15-9-18-2), కెమరూన్‌ గ్యానన్‌ (16-6-25-2) దెబ్బకు 98 పరుగులకు ఆలౌటైంది. తద్వారా వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ తేడాతో ఘన విజయం సాధించింది. టస్మానియా సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో బ్రాడ్లీ హోప్‌ (24) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

హ్యాట్రిక్‌ వికెట్లు తీసిన బ్రాడీ కౌచ్‌
ఈ మ్యాచ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రాడీ కౌచ్‌ హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టాడు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన తొలి వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా బౌలర్ బ్రాడీనే. మ్యాచ్‌ చివరి రోజు (నవంబర్‌ 4) టీ విరామం తర్వాత బ్రాడీ వరుసగా జేక్‌ డోరన్‌, లారెన్స్‌ నీల్ స్మిత్, కీరన్‌  ఇలియట్‌ వికెట్లు పడగొట్టాడు. టస్మానియా స్కోర్‌ 89 పరుగుల వద్ద నుండగా బ్రాడీ ఈ ఘనత సాధించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement