దేశవాళీ క్రికెట్ టోర్నీ దులిప్ ట్రోఫీ-2024లో టీమిండియా స్టార్లు భాగం కానున్నారు. జాతీయ జట్టుకు ఎంపికవ్వాలంటే దేశవాళీ టోర్నీల్లో ఆడాల్సిందే అని బీసీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. వచ్చే నెల 5 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో.. రిషభ్ పంత్, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, సూర్యకుమార్ యాదవ్, రజత్ పటిదార్ తదితరులు దులీప్ ట్రోఫీలో పాల్గొననున్నారు.
ఇందుకు సంబంధించి బీసీసీఐ తాజాగా జట్లను ప్రకటించింది. టీమ్-’ఎ’ కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్, టీమ్-బి సారథిగా అభిమన్యు ఈశ్వరన్, టీమ్-సి నాయకుడిగా రుతురాజ్ గైక్వాడ్, టీమ్-డి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ వ్యవహరించనున్నాడు. అయితే, ఈ ట్రోఫీ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. అన్నకు పోటీగా ఓ తమ్ముడు బరిలోకి దిగనున్నాడు. అంతేకాదు ఇద్దరూ ఒకే జట్టుకు ఆడబోతున్నారు.
అన్నదమ్ముల మధ్య పోటీ?
వారు మరెవరో కాదు ఖాన్ సోదరులు.. సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్. టీమ్-బి లో వీరిద్దరు భాగం కానున్నారు. అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్సీలో సర్ఫరాజ్‌తో పాటు ముషీర్ కూడా దులిప్ ట్రోఫీ ఆడనున్నాడు. అయితే, గతంలో వీరిద్దరు ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహించినా.. సర్ఫరాజ్ టీమిండియా అరంగేట్రం చేసిన తర్వాత ముషీర్‌తో కలిసి ఆడటం ఇదే తొలిసారి.
ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. అజేయ అర్ధ శతకంతో మెరిసి సత్తా చాటాడు. మొత్తంగా మూడు టెస్టులాడి ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 200 పరుగులు సాధించాడు.
తమ్ముడు ఆల్‌రౌండర్
నాడు కేఎల్ రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్.. ఈసారి బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో చోటు దక్కించుకోవాలంటే గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే సమయంలో సొంత తమ్ముడు ముషీర్ ఖాన్ కూడా టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించేందుకు సిద్ధం కావడం విశేషం. అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలో దుమ్ములేపిన ముషీర్.. ఫస్ట్‌క్లాస్ రికార్డు కూడా మెరుగ్గానే ఉంది.
అన్న సర్ఫరాజ్ ఖాన్.. ఇప్పటిదాకా 48 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో కలిపి 68.53 సగటుతో 4112 పరుగులు చేయగా.. ముషీర్ ఆడిన ఆరు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలోనే సగటు 58తో 529 పరుగులు రాబట్టాడు. అంతేకాదు.. ఈ ఆల్‌రౌండర్ ఖాతాలో ఏడు వికెట్లు కూడా ఉండటం విశేషం. ఇక సర్ఫరాజ్ స్పెషలిస్టు బ్యాటర్ కాగా.. ముషీర్ స్పిన్ ఆల్‌రౌండర్ కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment