టీమిండియా మిడిలార్డర్‌లో మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉందని భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డాడు. టెస్టుల్లో కేఎల్ రాహుల్‌కు ఉద్వాసన పలకాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. అయితే, సర్ఫరాజ్ ఖాన్‌ను జట్టులో కొనసాగిస్తూనే.. . రాహుల్ స్థానంలో ఇతడిని ఆడించాలంటూ ఓ ‘దేశవాళీ క్రికెట్ హీరో’పేరు మనోజ్ తివారీ సూచించాడు.
కాగా కర్ణాటక బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 53 టెస్టులు ఆడి 2981 పరుగులు చేశాడు. సగటు 33.88. ఇటీవల బంగ్లాదేశ్‌తో స్వదేశంలో టెస్టుల్లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో పూర్తిగా తేలిపోయాడు.
తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్
సొంతగడ్డ బెంగళూరులో కివీస్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన కేఎల్ రాహుల్.. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 12 పరుగులే చేయగలిగాడు. ఈ నేపథ్యంలో మనోజ్ తివారీ మాట్లాడుతూ.. రాహుల్ ఆట తీరును విమర్శించాడు. ‘‘91 ఇన్నింగ్స్ ఆడి కేవలం 33.88 సగటుతో బ్యాటింగ్ చేసే వాళ్లు మనకు అవసరమా?
స్పెషలిస్టు ఓపెనరే అయినప్పటికీ
భారత్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న బ్యాటర్లు చాలా మందే ఉన్నారు. అలాంటపుడు కేఎల్ రాహుల్ స్థానం గురించి మనం ఎందుకు పునరాలోచించకూడదు? టెస్టు మ్యాచ్‌లో సర్ఫరాజ్‌ను నాలుగో స్థానంలో పంపించాలి. నా అభిప్రాయం ప్రకారం.. అభిమన్యు ఈశ్వరన్‌ను కూడా మిడిలార్డర్‌లో ట్రై చేస్తే బాగుంటుంది.
అతడిపై ఓపెనర్ అనే ట్యాగ్ వేసి పక్కనపెడుతున్నారు. అతడు స్పెషలిస్టు ఓపెనరే అయినప్పటికీ మిడిలార్డర్లో ప్రయత్నించి చూస్తే తప్పేంటి? గత కొంతకాలంగా అతడు సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు’’ అని మనోజ్ తివారీ క్రిక్‌బజ్ షోలో వ్యాఖ్యానించాడు.
కాగా మనోజ్ మాదిరే దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్‌కు ఆడుతున్న అభిమన్యు ఈశ్వరన్ ఇటీవల ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో వరుసగా నాలుగు శతకాలు బాది జోరుమీదున్నాడు. ఇదిలా ఉంటే.. కివీస్‌తో బెంగళూరు టెస్టులో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. తదుపరి ఇరుజట్ల మధ్య అక్టోబరు 24న రెండో టెస్టు మొదలుకానుంది.
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత-‘ఎ’ జట్టును ఇటీవల ప్రకటించారు. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ఈ జట్టులో అభిమన్యుకు చోటు దక్కింది.
చదవండి: WTC 2023-25 Points Table: న్యూజిలాండ్ చేతిలో ఓటమి.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..?
Comments
Please login to add a commentAdd a comment