
ఐసీసీ అవార్డులు అందుకున్న బుమ్రా
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇదివరకే ప్రకటించిన అవార్డుల్ని ఆదివారం భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అందుకున్నాడు. 2024 క్యాలెండర్ ఇయర్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌లో విశేష ప్రదర్శన కనబరిచిన ఈ భారత సీనియర్ పేసర్ పురుషుల క్రికెట్‌లో నాలుగు అవార్డులకు ఎంపికయ్యాడు. ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’... ‘టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ వ్యక్తిగత అవార్డులు కాగా... 2024 ప్రదర్శన ఆధారంగా అన్ని దేశాల నుంచి ఆటగాళ్లతో ఐసీసీ జట్లను ఎంపిక చేసింది.
ఐసీసీ ప్రకటించిన టి20, టెస్టు జట్లలోనూ బుమ్రా ఉన్నాడు. దీంతో ‘టి20 టీమ్ ఆఫ్ ద ఇయర్’... ‘టెస్టు టీమ్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారాలల్లో భాగంగా ఐసీసీ ప్రత్యేకమైన రెండు టోపీలను అందజేసింది. వ్యక్తిగత అవార్డులుగా రెండు ట్రోఫీలను బహూకరించింది. ప్రస్తుతం వెన్నుగాయంతో ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఈ ‘పేస్ ఎక్స్‌ప్రెస్’ అవార్డు స్వీకరించేందుకే దుబాయ్‌కి వచ్చాడు.
ఉదయం మ్యాచ్‌కు ముందు తుది కసరత్తులో ఉన్న తమ జట్టు సహచరులతో ఆత్మీయంగా భేటీ అయ్యాక దాయాదుల మ్యాచ్ ఆరంభానికి ముందు అవార్డులు అందుకున్నాడు. ప్రేక్షకులంతా చప్పట్లతో అభినందనలు తెలిపారు. గతేడాది టెస్టుల్లో కేవలం 13 మ్యాచ్‌లే ఆడిన 31 ఏళ్ల బుమ్రా 71 వికెట్లు పడగొట్టడం విశేషం. ఓ క్యాలెండర్ ఇయర్‌లో 70 పైచిలుకు వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్‌గా ఘనతకెక్కాడు.
అతనికంటే ముందువరుసలో దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్, లెజెండ్ స్పిన్నర్లు అనిల్ కుంబ్లే, అశి్వన్ ఉన్నారు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 19 వికెట్లు తీసిన బుమ్రా... ఆ్రస్టేలియాలో జరిగిన ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో 32 వికెట్లు తీశాడు. అంటే కేవలం రెండే రెండు జట్లతో జరిగిన ముఖాముఖి సిరీస్‌ల్లోనే 51 వికెట్లు పడగొట్టడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment