
Canada Under 19 Cricket Team To Fly Back Home: అండర్-19 ప్రపంచ కప్ 2022 టోర్నీపై కరోనా కన్నెర్ర చేసింది. టోర్నీలో పాల్గొనేందుకు కరీబియన్ దీవులకు వచ్చిన వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు క్యూ కట్టి కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే టీమిండియాలోని ఆరుగురు ఆటగాళ్లు వైరస్ బారిన పడి, కోలుకోగా.. తాజాగా కెనడా జట్టులో ఏకంగా 9 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
దీంతో ఆ జట్టు 11 మంది ఆటగాళ్లను బరిలోకి దించలేక టోర్నీ మధ్యలోనే తప్పుకుంది. స్కాట్లాండ్‌తో ఇవాళ జరగాల్సిన మ్యాచ్‌కు ముందు కెనడా జట్టుకు ఈ దుస్థితి ఎదురైంది. మహమ్మారి కారణంగా పరిస్థితులు చేజారుతుండటంతో ఆటగాళ్ల భద్రత దృష్ట్యా టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు క్రికెట్ కెనడా ప్రకటించింది.
కాగా, టోర్నీ లీగ్ దశలో ఉండగా టీమిండియా కెప్టెన్ యష్ ధుల్ సహా వైస్ కెప్టెన్ షేక్ రషీద్, మరో నలుగురు భారత ఆటగాళ్లు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే అదృష్టవశాత్తు భారత్ జంబో జట్టుతో ప్రపంచకప్ బరిలోకి దిగడంతో ఆటగాళ్ల కొరత ఏర్పడలేదు. ఈ దశలో ప్రధాన ఆటగాళ్లు ఐసోలేషన్‌లో ఉన్నా టీమిండియా అద్భుత విజయాలు సాధించింది.
ఉగాండా, ఐర్లాండ్‌లపై భారీ విజయాలు నమోదు చేసి క్వార్టర్స్‌కు చేరుకుంది. ఇవాళ క్వార్టర్స్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనున్న యువ భారత్.. 2019 ప్రపంచకప్ ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతుంది. కాగా, గ్రూప్ 1 నుంచి ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఇదివరకే సెమీస్ బెర్తును ఖరారు చేసుకోగా.. గ్రూప్ 2 నుంచి రెండో బెర్తు కోసం భారత్, బంగ్లాదేశ్ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ గ్రూప్ నుంచి ఆస్ట్రేలియా ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించింది.
చదవండి: IND Vs WI: టీమిండియా సేఫ్ హ్యాండ్స్‌లో ఉంది.. అయినా మాతో అంత ఈజీ కాదు..!