భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ పిటిషన్‌పై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. వినేశ్ పిటిషన్‌ను తాము స్వీకరించామని.. అయితే ఈరోజే తమ నిర్ణయం వెల్లడించలేమని తెలిపింది. కాగా మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో తలపడ్డ వినేశ్ ఫొగట్.. సంచలన విజయాలతో ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే.
మరో అవకాశం కోసం
అయితే, బుధవారం నాటి ఫైనల్ బౌట్‌కు ముందు.. నిర్ణీత 50 కిలోల కంటే వంద గ్రాములు ఎక్కువ బరువు ఉందన్న కారణంగా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(UWW) ఆమెపై వేటు వేసింది. ఫైనల్ పోరుకు ముందు ఉదయం నిర్వహించిన వెయిన్‌లో వినేశ్ అధిక బరువు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే, ఈ విషయంపై వినేశ్ తక్షణమే సీఏఎస్‌ను ఆశ్రయించింది. తనకు మరో అవకాశం ఇచ్చి పోటీకి అనుమతించాలని కోరింది.
అందుకే పరిగణనలోకి తీసుకోలేదు
ఇందుకు బదులుగా.. ‘‘గోల్డ్ మెడల్ మ్యాచ్‌కు తనను అనుమతించాలన్న వినేశ్ అభ్యర్థనను మేము పరిగణనలోకి తీసుకోలేం. ఎందుకంటే.. తను ఏరోజైతే ఫిర్యాదు చేసిందో అదే రోజు మ్యాచ్ కూడా ఉంది. అంతేకాదు.. తను మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరలేదు.
అడ్‌హక్ డివిజన్ ప్రక్రియ వేగవంతంగానే ఉంటుంది. కానీ మరీ గంటలో నిర్ణయం తీసుకోవడం కుదరదు. ముందుగా UWW వాదనలు కూడా వినాలి. ఆ తర్వాత.. ఫిర్యాదుదారు వాదనలు వినాలి. ఇందుకు ఎక్కువ సమయమే పడుతుంది. కాబట్టి ఇది వీలుపడదు.
ఆరోజే నిర్ణయం వెల్లడిస్తాం
అయితే, అప్లికెంట్ తనకు సంయుక్తంగా రజత పతకం ఇవ్వాలన్న పిటిషన్‌ను మాత్రం స్వీకరించాం. గౌరవనీయులైన మా సోలో ఆర్బిట్రేటర్ డాక్టర్ అనబెలె బెనెట్ ఈరోజు ఇరు వర్గాల వాదనలు వింటారు. ఒలింపిక్ క్రీడల ముగింపులోపు తన నిర్ణయాన్ని వెల్లడిస్తారు’’ అని సీఏఎస్ తన ప్రకటనలో పేర్కొంది. కాగా వినేశ్ తరఫున ప్రముఖ లాయర్ హరీశ్ సాల్వే వాదనలు వినిపించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment