సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో ఒక వింత సన్నివేశం చోటుచేసుకుంది. ఆడుతుంది ఎంత ఫ్రెండ్లీ మ్యాచ్ అయినా కాస్త అయినా సీరియస్‌నెస్ లేదు. పిచ్చి చేష్టలతో థర్డ్ అంపైర్‌కు మెంటల్ ఎక్కించారు ఇరుజట్ల ఆటగాళ్లు. విషయంలోకి వెళితే.. తెలుగు వారియర్స్, కర్నాటక బుల్‌డోజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తెలుగు వారియర్స్‌కు అఖిల్ నేతృత్వం వహించగా.. కర్నాటకకు సుదీప్ కెప్టెన్‌గా ఉన్నాడు.
అయితే కర్నాటక ఇన్నింగ్స్ సమయంలో విచిత్ర సంఘటన జరిగింది. బౌలర్ వేసిన బంతిని కర్నాటక బ్యాటర్ కవర్స్ దిశగా ఆడాడు. సింగిల్ బాగానే పూర్తి చేసిన బ్యాటర్లు రెండో పరుగు కోసం యత్నించారు. అయితే నాన్‌స్ట్రైక్ ఎండ్ నుంచి వెళ్లిన బ్యాటర్.. కీపర్ బంతిని స్టంప్స్‌కు వేసే సమయానికి అతనికి అడ్డుగా వెళ్లాడు. దీంతో రనౌట్ చాన్స్ మిస్ అయింది.
బంతి కూడా దూరంగా వెళ్లడంతో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ మూడో పరుగు కోసం స్ట్రైకింగ్ ఎండ్‌కు వచ్చేశాడు. అప్పటికి మరొక బ్యాటర్ అక్కడే ఉన్నాడు. తెలుగు వారియర్స్ ఫీల్డర్ చెత్త త్రో వేయడం.. ఇంతలో ఎవరు ఊహించని హైడ్రామా జరిగింది. మైదానంలోకి మూడో బ్యాటర్ ఎంటరయ్యాడు. అసలు అతను ఎందుకు వచ్చాడో ఎవరికి అర్థం కాలేదు. ఇదంతా ఒక ఎత్తు అంటే.. చివరికి ఇద్దరు బ్యాటర్లు మళ్లీ ఒకే ఎండ్‌లోకి చేరుకోవడం.. అటు ఫీల్డర్ కూడా సరైన త్రో వేయడంతో ఈసారి కీపర్ వికెట్లను గిరాటేశాడు. కానీ స్ట్రైకింగ్ ఎండ్‌లో బ్యాటర్లు ఎవరు లేరన్న విషయాన్ని గుర్తించిలేకపోయారు.
ఆ తర్వాత తెలుగు వారియర్స్ ఆటగాళ్లు ఔట్ అంటూ అప్పీల్ చేశారు. మైదానంలో ఉన్న ఫీల్డ్ అంపైర్లకు ఏం అర్థంగాక థర్డ్ అంపైర్‌ను సంప్రదించారు. అప్పటికే ఆటగాళ్ల పిచ్చి చేష్టల కారణంగా థర్డ్ అంపైర్‌కు మెంటల్ ఎక్కే ఉంటుంది. ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థంకాక కాసేపు అలాగే ఉండిపోయాడు. చివరకు ఏం రివ్యూ ఇవ్వాలో తెలియక బంతిని డెడ్‌బాల్‌గా పరిగణించి.. అటు పరుగులు ఇవ్వలేదు.. ఇటు బంతిని కౌంట్ చేయలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విజేతగా తెలుగు వారియర్స్ నిలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన దబాంగ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను పది ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. ఆదిత్య 26, అస్గర్ 11 పరుగులు చేశారు. వారియర్ నందకిషోర్ రెండు వికెట్లు తీశాడు.ప్రతిగా బ్యాటింగ్ చేసిన తెలుగు వారియర్స్ 4 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగుల ఆధిక్యం సాధించింది. ఓపెనర్ అఖిల్ 67 పరుగులతో రాణించాడు. తరువాత రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన దబాంగ్ ఆరు వికెట్లకు 89 పరుగులు చేసింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన తెలుగు వారియర్స్ 6.1 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టపోయి విజయలక్ష్యాన్ని సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment