వన్డే వరల్డ్‌కప్ 2023 రౌండ్ రాబిన్ లీగ్ దశ మ్యాచ్‌లు ముగిసాయి. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి. బుధవారం (నవంబర్ 15) జరుగబోయే తొలి సెమీఫైనల్లో (ముంబై) భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. నవంబర్ 16న జరిగే రెండో సెమీఫైనల్లో (కోల్‌కతా) సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఢీకొంటాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచే జట్లు అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి అర్హత సాధించిన 8 జట్లు ఏవంటే..?
వరల్డ్‌కప్ 2023 రౌండ్ రాబిన్ లీగ్ దశ మ్యాచ్‌లు ముగిసిన అనంతరం టాప్-8లో నిలిచే జట్లే 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తాయని ఐసీసీ మెలిక పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆయా స్థానాల్లో ఉన్న భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీకి నేరుగా అర్హత సాధించాయి. ఆతిథ్య దేశ హోదాలో పాకిస్తాన్ బెర్త్ ముందుగానే ఖరారైంది.
బంగ్లాదేశ్‌కు లక్కీ ఛాన్స్.. శ్రీలంకకు నిరాశ
పాయింట్ల పట్టికలో తొమ్మిది, పది స్థానాల్లో నిలిచిన శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లకు నిరాశ ఎదురు కాగా.. ఈ జట్లతో సమానంగా వరల్డ్‌కప్‌లో రెండే మ్యాచ్‌లు గెలిచిన బంగ్లాదేశ్ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. 2002 ఎడిషన్ ఛాంపియన్ అయిన శ్రీలంక ప్రస్తుత వరల్డ్‌కప్‌లో పేలవ ప్రదర్శనతో ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత కోల్పోవడంతో పాటు ఐసీసీ బ్యాన్‌కు కూడా ఎదుర్కొంటుంది.
ఆపసోపాలు పడి అర్హత సాధించిన ఇంగ్లండ్
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ప్రస్తుత వరల్డ్‌కప్‌లో అడుగుపెట్టిన ఇంగ్లండ్ టోర్నీ ఆరంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొని తుది దశ లీగ్ మ్యాచ్‌ల వరకు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండింది. అయితే ఆ జట్టు అనూహ్యంగా పుంజుకుని చివరి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి ఎగబాకి ఛాంపియన్స్ ట్రోఫీ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
పాపం నెదర్లాండ్స్..
ప్రస్తుత వరల్డ్‌కప్‌లో తమకంటే చాలా రెట్లు పటిష్టమైన సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లకు షాకిచ్చిన నెదర్లాండ్స్ మిగతా మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శన కనబర్చి పాయింట్ల పట్టికలో పదో స్థానంలో నిలిచి ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి అర్హత సాధించలేకపోయింది.
వెస్టిండీస్, జింబాబ్వే, ఐర్లాండ్‌లకు నో ఛాన్స్..
2023 వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేకపోయిన ఐసీసీ ఫుల్ టైమ్ సభ్య దేశాలైన వెస్టిండీస్, జింబాబ్వే, ఐర్లాండ్ జట్లు 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత కోల్పోయాయి. ఐసీసీ పెట్టిన మెలిక కారణంగా ఈ జట్లకు చుక్కెదురైంది.
Comments
Please login to add a commentAdd a comment