2023 సంవత్సరపు అత్యుత్తమ టెస్ట్ జట్టుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఇవాళ (డిసెంబర్ 31) ప్రకటించింది. ఈ జట్టులో కేవలం ఇద్దరు ఆస్ట్రేలియన్లకు మాత్రమే చోటు దక్కడం విశేషం. సారధిగా పాట్ కమిన్స్‌ను ఎంపిక చేసిన సీఏ.. ఓపెనర్‌గా ఉస్మాన్ ఖ్వాజాకు అవకాశం కల్పించింది. ఈ జట్టులో టీమిండియా నుంచి సైతం ఇద్దరికి మాత్రమే అవకాశం లభించింది.
స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల ద్వయం రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ జట్టుకు వికెట్‌కీపర్ బ్యాటర్‌గా ఐర్లాండ్ ఆటగాడు లోర్కాన్ టక్కర్‌ను ఎంపిక చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్ ఆల్‌టైమ్ గ్రేట్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌కు ఎవరూ ఊహించని విధంగా ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు కల్పించింది.
బ్రాడ్‌తో పాటు ఇంగ్లండ్ నుంచి మరో ఇద్దరు ఆటగాళ్లకు కూడా చోటు లభించింది. మిడిలార్డర్ ఆటగాళ్లుగా జో రూట్, హ్యారీ బ్రూక్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు దక్కించుకున్నారు. స్పెషలిస్ట్ పేసర్‌గా సౌతాఫ్రికా స్పిడ్ గన్ కగిసో రబాడకు అవకాశం కల్పించిన సీఏ.. రెండో ఓపెనర్‌గా శ్రీలంక ఆటగాడు దిముత్ కరుణరత్నే, వన్ డౌన్ బ్యాటర్‌గా కేన్ విలియమ్సన్‌లకు అవకాశం కల్పించింది.
జట్ల వారీగా చూస్తే.. ఇంగ్లండ్ నుంచి ముగ్గురు, భారత్, ఆస్ట్రేలియా జట్ల నుంచి చెరి ఇద్దరు, శ్రీలంక, న్యూజిలాండ్, ఐర్లాండ్, సౌతాఫ్రికా జట్ల నుంచి చెరో ఆటగాడిని క్రికెట్ ఆస్ట్రేలియా తమ అత్యుత్తమ టెస్ట్ జట్టులోకి తీసుకుంది. ఈ జట్టులో పాకిస్తాన్ ఆటగాళ్లెవరికీ చోటు దక్కకపోవడం విశేషం. అలాగే తమ స్పిన్ తురుపుముక్క నాథన్ లియోన్‌కు కూడా క్రికెట్ ఆస్ట్రేలియా అవకాశం కల్పించలేదు.
క్రికెట్ ఆస్ట్రేలియా అత్యుత్తమ టెస్ట్ జట్టు (2023): ఉస్మాన్ ఖ్వాజా, దిముత్ కరుణరత్నే, కేన్ విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, లోర్కాన్ టక్కర్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, పాట్ కమిన్స్ (కెప్టెన్), కగిసో రబాడ, స్టువర్ట్ బ్రాడ్
Comments
Please login to add a commentAdd a comment