యూఎస్‌ఏ, కరీబియన్ దీవులు వేదికగా ఈ ఏడాది జూన్ 1 నుంచి జరుగబోయే టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం 15 మంది సభ్యుల న్యూజిలాండ్ జట్టును ఇవాళ (ఏప్రిల్ 29) ప్రకటించారు. స్టార్లతో నిండిన ఈ జట్టుకు కేన్ విలియమ్సన్ సారథ్యం వహించనున్నాడు. గాయపడిన ఆడమ్ మిల్నే స్థానంలో మ్యాట్ హెన్రీ వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్, లోకీ ఫెర్గూసన్‌లతో కలిసి హెన్రీ కొత్త బంతిని షేర్ చేసుకుంటాడు. బొటనవేలి గాయంతో బాధపడుతున్న డెవాన్ కాన్వేను సైతం న్యూజిలాండ్ సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ జట్టులో మరో వికెట్‌కీపర్ బ్యాటర్ ఫిన్ అలెన్‌కు స్థానం లభించినప్పటికీ.. వరల్డ్‌కప్‌లో కాన్వేనే కీపింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
వికెట్‌కీపర్ బ్యాటర్లైన టిమ్ సీఫర్ట్, టామ్ బ్లండెల్‌లకు వరల్డ్‌కప్ జట్టులో చోటు లభించలేదు. ఇటీవల పాక్‌తో సిరీస్‌ను (టీ20) డ్రా చేసుకున్న జట్టుకు సారధి అయిన మైఖేల్ బ్రేస్‌వెల్ కూడా వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. జిమ్మీ నీషమ్, డారిల్ మిచెల్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల కోటాలో ఎంపికయ్యారు.
స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా ఐష్ సోధి, మిచెల్ సాంట్నార్.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లుగా గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మార్క్ చాప్‌మన్ వ్యవహరించనున్నారు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో మూడు శతకాలతో విజృంభించిన రచిన్ తొలిసారి టీ20 వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికయ్యాడు.
ఈ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా లూక్ రాంచీ, బౌలింగ్ కోచ్‌గా జేకబ్ ఓరమ్, అసిస్టెంట్ కోచ్‌గా జేమ్స్ ఫోస్టర్ వ్యవహరించనున్నారు. హెడ్ కోచ్‌గా గ్యారీ స్టెడ్ కొనసాగనున్నాడు. వరల్డ్‌కప్ కోసం న్యూజిలాండ్ జట్టు మే 23న బయల్దేరనుంది. జూన్ 7న న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్ (ఆఫ్ఘనిస్తాన్) ఆడనుంది.
న్యూజిలాండ్ టీ20 వరల్డ్‌కప్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఐష్ సోధీ [ట్రావెలింగ్ రిజర్వ్-బెన్ సియర్స్ ]
Join special guests Matilda and Angus at the squad announcement for the upcoming @t20worldcup in the West Indies and USA. #T20WorldCup pic.twitter.com/6lZbAsFlD5
— BLACKCAPS (@BLACKCAPS) April 29, 2024
వరల్డ్‌కప్ జట్టును వినూత్నంగా ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్
న్యూజిలాండ్ క్రికెట్ తమ టీ20 వరల్డ్‌కప్ జట్టును వినూత్నంగా ప్రకటించింది. సెలక్టర్లు, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రతినిథులు కాకుండా ఇద్దరు చిన్నారులు జట్టు సభ్యుల పేర్లను వెల్లడించారు. న్యూజిలాండ్ క్రికెట్ మటిల్డా, ఆంగస్ అనే ఇద్దరు చిన్నారులకు చీఫ్ గెస్ట్‌లుగా ఆహ్వానించింది.
The team's kit for the 2024 @T20WorldCup 🏏
Available at the NZC store from tomorrow. #T20WorldCup pic.twitter.com/T4Okjs2JIx— BLACKCAPS (@BLACKCAPS) April 29, 2024
న్యూజిలాండ్ క్రికెట్ చేసిన ఈ వినూత్న ప్రయోగం అందరినీ ఆకట్టుకుంది. వరల్డ్‌కప్ జట్టు ప్రకటన సందర్భంగా న్యూజిలాండ్ క్రికెట్ తమ వరల్డ్‌కప్ జెర్సీని కూడా రివీల్ చేసింది. మెగా టోర్నీలో న్యూజిలాండ్ క్రికెటర్లు తాము రెగ్యులర్‌గా ధరించే బ్లాక్ కిట్ కాకుండా వేరే కలర్‌లో ఉండే కిట్‌లను ధరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment