
స్మిత్- హష్మతుల్లా (PC: ICC)
వరణుడు కరుణించాడు. అఫ్గనిస్తాన్- ఆస్ట్రేలియా(Afghanistan vs Australia) మధ్య మ్యాచ్‌కు మార్గం సుగమం చేశాడు. ఫలితంగా లాహోర్ వేదికగా ఇరుజట్ల మధ్య సెమీస్ రేసు సమరానికి నగారా మోగింది. టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) మొదలైన విషయం తెలిసిందే. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ ఈ వన్డే టోర్నమెంట్ బరిలో దిగాయి.
ఇక ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి భారత్(Team India), న్యూజిలాండ్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టగా.. గ్రూప్-‘బి’ సెమీ ఫైనలిస్టులు శుక్రవారం నాటి ఆఫ్గన్- ఆసీస్ మ్యాచ్ ఫలితంతో ఖరారు కానున్నాయి.
గెలిస్తే నేరుగా సెమీస్‌కే
గ్రూప్-‘బి’లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో అఫ్గన్‌ను 107 పరుగుల తేడాతో చిత్తు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. అనంతరం ఆస్ట్రేలియాతో రావల్పిండిలో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా.. మొత్తంగా మూడు పాయింట్లు సాధించిన ప్రొటిస్ జట్టు నెట్ రన్‌రేటు(+2.140) పరంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఇక ఇదే గ్రూపులో ఉన్న ఆసీస్ కూడా ప్రస్తుతం మూడు పాయింట్లతో ఉండగా.. ఇంగ్లండ్‌ను ఓడించిన అఫ్గనిస్తాన్ ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నాయి. మరోవైపు.. ఇప్పటికే ఆసీస్, అఫ్గన్ చేతిలో ఓడిన ఇంగ్లండ్ ఇంటిబాట పట్టగా.. సెమీస్ రేసులో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్ పోటీపడుతున్నాయి.
ఇందులో భాగంగా లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో శుక్రవారం నాటి మ్యాచ్ తొలి సెమీ ఫైనలిస్టును ఖరారు చేయనుంది. అఫ్గన్- ఆసీస్ పోరులో గనుక కంగారూ జట్టు గెలిస్తే ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా సెమీస్ చేరుతుంది. అఫ్గన్ గెలిచినా నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెడుతుంది. అయితే, అప్పుడు ఆస్ట్రేలియా సౌతాఫ్రికా- ఇంగ్లండ్ ఫలితం కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది.
అందుకే ముందుగా బ్యాటింగ్
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది తొలుత బ్యాటింగ్ చేయడానికి మొగ్గుచూపాడు. ‘‘వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. ద్వితీయార్థ భాగంలో కాస్త మందకొడిగా ఉంటుందనిపిస్తోంది. అందుకే ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇంగ్లండ్‌పై గెలిచిన జట్టుతోనే ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనూ బరిలోకి దిగుతున్నాం’’ అని హష్మతుల్లా తెలిపాడు.
మరోవైపు.. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. తాను టాస్ గెలిస్తే ముందుగా బౌలింగే ఎంచుకునేవాడినని తెలిపాడు. పిచ్ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయని.. ఏదేమైనా తమ ఆటగాళ్లు దూకుడుగా ముందుకు వెళ్లడం ఖాయమన్నాడు.తాము కూడా ఎలాంటి మార్పుల్లేకుండా.. ఇంగ్లండ్‌తో ఆడిన జట్టుతోనే ఆడబోతున్నట్లు తెలిపాడు.
అఫ్గనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా తుదిజట్లు
అఫ్గనిస్తాన్
రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, హష్మతుల్లా షాహిది(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బదిన్ నాయిబ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూఖీ.
ఆస్ట్రేలియా
మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్.
చదవండి: #Jos Buttler: అఫ్గాన్ చేతిలో ఓటమి.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం!