
అఫ్గనిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు కెప్టెన్ హష్మతుల్లా షాహిది(Hashmatullah Shahidi)కి కోపమొచ్చింది. తాము చాంపియన్స్ ట్రోఫీ గెలిచేందుకు వచ్చామని.. కేవలం ఒక్క వ్యక్తితో పోటీపడటానికి కాదంటూ అతడు అసహనాన్ని వెళ్లగక్కాడు. ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్‌కు ముందు విలేకరులు వేసిన ప్రశ్నే ఇందుకు కారణం.
ఇంగ్లండ్‌ను బయటకు పంపిన అఫ్గన్
కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో తమ ఆరంభ మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓడిన అఫ్గనిస్తాన్.. ఇంగ్లండ్‌పై గెలుపుతో సెమీస్ రేసులో నిలిచింది. రెండో మ్యాచ్‌లో భాగంగా బట్లర్ బృందాన్ని(Afghanistan vs England) ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో ఓడించి టోర్నీ నుంచి బయటకు పంపిన అఫ్గన్ జట్టు.. శుక్రవారం లాహోర్‌లో పటిష్ట ఆస్ట్రేలియాతో తలపడనుంది.
మీకేం అనిపిస్తోంది?
ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది మీడియాతో మాట్లాడగా.. ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ గురించి ప్రశ్న ఎదురైంది. మాక్సీ కోసం అఫ్గన్ ఎలాంటి ప్రణాళికలు రచించిందని విలేకరులు అడుగగా.. ‘‘మీకేం అనిపిస్తోంది?... కేవలం మాక్స్‌వెల్‌తో ఆడేందుకే మేము ఇక్కడికి వచ్చాం అనుకుంటున్నారా?
దయచేసి అలా ఆలోచించవద్దు. మేము మొత్తం ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉన్నాము. అందుకు తగ్గ వ్యూహాలు మా దగ్గర ఉన్నాయి. వన్డే వరల్డ్‌కప్-2023లో మాక్స్‌వెల్ అద్బుతంగా ఆడాడని నాకూ తెలుసు. కానీ అదంతా గతం.
ఆస్ట్రేలియాను ఓడించాం
ఆ మ్యాచ్ తర్వాత మేము టీ20 ప్రపంచకప్-2024లో ఆస్ట్రేలియాను ఓడించాం. ప్రత్యర్థి జట్లు అన్నీ మాకు సమానమే. అన్ని మ్యాచ్‌లకు మేము పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతాము. అంతేగానీ.. ఒక్క ఆటగాడిని ఎదుర్కొనేందుకు మేము ఇక్కడకు రాలేదు.
మాక్స్‌వెల్‌తో పాటు ఆసీస్ జట్టు మొత్తాన్ని ఎదుర్కునేందుకు అత్యుత్తమ స్థాయిలో రాణించాలని భావిస్తున్నాం’’ అంటూ దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు. కాగా భారత్ వేదికగా 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ టోర్నీలో అఫ్గనిస్తాన్ అదరగొట్టిన విషయం తెలిసిందే. పాకిస్తాన్, ఇంగ్లండ్‌ను ఓడించడంతో పాటు ఆస్ట్రేలియానూ ఓడించినంత పనిచేసింది.
మాక్స్‌వెల్ మాయతో ఆరోజు అలా!
అయితే, అఫ్గన్ విధించిన 292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ కష్టాల్లో కూరుకుపోయిన వేళ మాక్స్‌వెల్ పరుగుల తాండవం చేశాడు. చేతిలో ఏదో మంత్రదండం ఉందా అన్నట్లుగా బ్యాట్‌తో మాయచేశాడు. ఒక కాలికి గాయమైనా.. ఒంటి కాలితోనే పరుగులు తీశాడు. అద్బుత బ్యాటింగ్‌తో ఏకంగా 201 పరుగులతో అజేయంగా నిలిచి కంగారూ జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఫలితంగా సెమీస్ చేరుకోవాలన్న అఫ్గనిస్తాన్ ఆశలకు గండిపడగా.. ఫైనల్లోనూ గెలిచిన ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతగా అవతరించింది. అయితే, ఈ మ్యాచ్ తర్వాత అఫ్గన్- ఆసీస్ టీ20 ప్రపంచప్-2024లో తలపడగా.. ఈసారి హష్మతుల్లా బృందం పైచేయి సాధించి సెమీ ఫైనల్ చేరుకుంది.
ఇక వన్డేల్లో మాత్రం ఇప్పటి వరకు అఫ్గనిస్తాన్- ఆస్ట్రేలియా నాలుగు మ్యాచ్‌లలో తలపడగా.. నాలుగింట ఆసీస్ విజయం సాధించింది. చాంపియన్స్ ట్రోఫీ తాజా మ్యాచ్‌లో గనుక అఫ్గన్ గెలిస్తే సరికొత్త చరిత్ర ఆవిష్కృతం కావడంతో పాటు.. ఆసీస్‌ను బయటకు పంపి సెమీస్‌కూ చేరి కొత్త రికార్డు సాధిస్తుంది.
చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆస్ట్రేలియా జట్టు:
మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, సీన్ అబాట్, ఆరోన్ హార్డీ, తన్వీర్ సంఘా.
అఫ్గనిస్తాన్ జట్టు
రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిది(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూఖీ, ఫరీద్ అహ్మద్ మాలిక్,ఇక్రం అలిఖిల్, నంగెలియా ఖరోటే, నవీద్ జద్రాన్.
చదవండి: Ind vs NZ: కివీస్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా అతడు.. పంత్‌కి ఛాన్స్!
Comments
Please login to add a commentAdd a comment