వన్డే ఫార్మాట్‌తో పాటు పొట్టి ఫార్మాట్‌లోనూ డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లో గ్రహణం పట్టినట్లుంది. ప్రస్తుత ఎడిషన్‌లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట ఓటమిపాలై, అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించే స్థితికి చేరింది.
భారీ అంచనాల నడుమ వరల్డ్‌కప్ బరిలోకి దిగిన బట్లర్ సేన.. న్యూజిలాండ్, సౌతాఫ్రికా లాంటి సమవుజ్జీలతో పాటు ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక లాంటి చిన్న జట్ల చేతిలోనూ ఓటమిపాలై, సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. చివరి మూడు మ్యాచ్‌ల్లో దారుణ పరాజయాలు ఎదుర్కొన్న ఇంగ్లీష్ టీమ్.. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో (నెదర్లాండ్స్‌కు ముందు) నిలిచింది.
స్టోక్స్ ఎంట్రీ ఇచ్చినా ఒరింగిదేమీ లేదు..!
గాయం నుంచి పూర్తిగా కోలుకోని బెన్ స్టోక్స్‌ను హడావుడి చేసి (వన్డే ఫార్మాట్ రాజీనామా ఉపసంహరణ) వరల్డ్‌కప్ బరిలోకి దించిన ఇంగ్లీష్ టీమ్.. అందుకు తగిన మూల్యమే చెల్లించుకుంది. ఫిట్‌గా లేని స్టోక్స్‌కు తుది జట్టులో ఆడించలేక.. అతని స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేయలేక సతమతమైన ఇంగ్లీష్ మేనేజ్‌మెంట్.. ఎట్టకేలకు ధైర్యం చేసి సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో అతన్ని బరిలోకి దించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
అతను ఆడిన రెండు మ్యాచ్‌ల్లో నామమాత్రపు ప్రదర్శనకే పరిమితమయ్యాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 5, లంకతో మ్యాచ్‌లో 43 పరుగులు మాత్రమే చేసి దారుణంగా నిరాశపరిచాడు. స్టోక్స్ బంతితో ఏమైనా అద్భుతాలు చేస్తాడా అనుకుంటే.. అతను బంతిపట్టి చాలాకాలమే అయ్యింది.
అరివీరభయంకరులైన బ్యాటర్లకు ఏమైంది..?
ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ వరుస ఓటములకు ప్రధాన కారణం బ్యాటర్ల వైఫల్యమే అని చెప్పాలి. అరివీర భయంకరులతో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ నిండివున్నా ఈ టోర్నీలో వారు చేసిందేమీ లేదు. డేవిడ్ మలాన్, జో రూట్ కాస్త పర్వాలేదనిపించినా.. బెయిర్‌స్టో, బట్లర్, లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ దారుణంగా నిరాశపరిచారు.
బౌలర్ల ప్రదర్శన అంతంతమాత్రమే..
ఈ టోర్నీలో ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ దారుణంగా నిరాశపరిచింది. టోర్నీ తొలి మ్యాచ్‌లో (న్యూజిలాండ్‌తో) 283 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఆ జట్టు బౌలర్లు చేతులెత్తేశారు. ప్రత్యర్ధి వీరు నిర్ధేశించిన లక్ష్యాన్ని కేవలం 36.2 ఓవర్లలో ఛేదించింది. ఈ మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్లు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర విధ్వంసకర శతకాలతో ఇంగ్లీష్ బౌలర్లను చీల్చిచెండాడారు.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో మలాన్ భారీ సెంచరీతో కదంతొక్కడంతో ప్రత్యర్ధికి (బంగ్లాదేశ్) 365 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించిన ఇంగ్లీష్ టీమ్.. ఈ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్లు తలా ఓ చేయి వేసి ప్రత్యర్ధిని 48.2 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌట్ చేశారు.
ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఆఫ్ఘన్ బౌలర్లు ఓ మోస్తరు లక్ష్యఛేదనలో (285) ఇంగ్లండ్‌ను 215 పరుగులకే కుప్పకూల్చి సంచలన విజయం సాధించారు.
అనంతరం సౌతాఫ్రికా, శ్రీలంక చేతుల్లో అదే పరాభవాలు..
ఆఫ్ఘనిస్తాన్ షాకివ్వడంతో ఇంగ్లండ్ జట్టు టోర్నీ తరువాతి మ్యాచ్‌ల్లో ఒళ్లు దగ్గరపెట్టుకుని ఆడుతుందని అంతా అనుకున్నారు. అయితే ఇది జరగకపోగా.. ఇంగ్లండ్ ప్రదర్శన మరింత అధ్వానంగా మారింది. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్లు ఏకంగా 399 పరుగులు సమర్పించుకోగా.. బ్యాటర్లంతా మూకుమ్మడిగా చేతులెత్తేయడంతో ఇంగ్లండ్ టీమ్ 170 పరుగులకే కుప్పకూలి మరో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఇది మరిచిపోయేలోపే మరో షాక్..
ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికాల చేతుల్లో దారణ పరాజయాలు మరచిపోయేలోపే ఇంగ్లండ్ టీమ్‌ను మరో అవమానం పలకరించింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో ఘోరంగా విఫలమై మరో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 156 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొన్న లంక బ్యాటర్లు 25.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు.
ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలు ఇతర జట్ల చేతుల్లో..
ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు పరాజయాల తర్వాత ఇంగ్లండ్ జట్లు పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఆఖరి స్థానంలో నెదర్లాండ్స్ ఉంది. ఈ ఎడిషన్‌లో ఇంగ్లండ్ సెమీస్‌కు చేరాడమనే అంశం ఇతర జట్ల జయాపజాలపై అధారపడి ఉంది.
ఇంగ్లండ్ తదుపరి ఆడే నాలుగు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించి.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న జట్లు తమకంటే తక్కువ పాయింట్లు కలిగిన జట్ల చేతుల్లో ఓడితే ఇంగ్లండ్‌కు సెమీస్‌కు చేరే అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇంగ్లండ్ పుంజుకుంటుందో లేక అవమాన భారంతో టోర్నీ నుంచి నిష్క్రమిస్తుందో తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment