CWC 2023 IND VS AFG: సచిన్‌ రికార్డు బద్దలు కొట్టిన విరాట్‌ | CWC 2023 IND Vs AFG: Virat Kohli Breaks Sachin Tendulkar Record For Most Runs In ODI And T20 World Cups - Sakshi
Sakshi News home page

CWC 2023 IND Vs AFG: సచిన్‌ రికార్డు బద్దలు కొట్టిన విరాట్‌

Published Thu, Oct 12 2023 7:18 AM | Last Updated on Thu, Oct 12 2023 7:59 AM

CWC 2023 IND VS AFG: Virat Kohli Breaks Sachin Tendulkar Record For Most Runs In ODI And T20 World Cups - Sakshi

న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి.. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు చెందిన ఓ రికార్డును బద్దలు కొట్టారు. ఈ మ్యాచ్‌లో 56 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచిన విరాట్‌.. ప్రపంచకప్‌ టోర్నీల్లో (వన్డే, టీ20) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించారు. గతంలో ఈ రికార్డు సచిన్‌ పేరిట ఉండేది.

సచిన్‌ 44 వరల్డ్‌కప్‌ ఇన్నింగ్స్‌ల్లో 2278 పరుగులు చేయగా.. విరాట్‌ తాజా ఇన్నింగ్స్‌ కలుపుకుని 53 ఇన్నింగ్స్‌ల్లో 60కిపైగా సగటుతో 2311 పరుగులు చేశాడు. 2011 వన్డే వరల్డ్‌కప్‌తో వరల్డ్‌కప్‌ అరంగేట్రం చేసిన విరాట్‌.. బంగ్లాదేశ్‌తో జరిగిన తన వరల్డ్‌కప్‌ డెబ్యూ మ్యాచ్‌లోనే సెంచరీ (100 నాటౌట్‌) చేసి అదరగొట్టాడు. ఆ వరల్డ్‌కప్‌లో కోహ్లి 9 ఇన్నింగ్స్‌ల్లో 282 పరగులు చేసి ఆకట్టుకున్నాడు.

తదనంతర వన్డే వరల్డ్‌కప్‌ల్లో వెనుదిరిగి చూసుకోని కోహ్లి పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం కోహ్లి వన్డే వరల్డ్‌కప్‌ల్లో భారత్‌ తరఫున సచిన్‌, గంగూలీ తర్వాత మూడో అత్యధిక రన్‌ స్కోరర్‌గా (1170 రన్స్‌) కొనసాగుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌ల విషయానికొస్తే.. కెరీర్‌లో 5 పొట్టి వరల్డ్‌కప్‌ టోర్నీల్లో పాల్గొన్న కోహ్లి లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ టోర్నీల్లో మొత్తంగా 25 ఇన్నింగ్స్‌లు ఆడిన అతను 81.50 సగటున 14 హాఫ్‌ సెంచరీల సాయంతో 1141 పరుగులు చేశాడు. 

ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేయగా.. రోహిత్‌ శర్మ (84 బంతుల్లో 131; 16 ఫోర్ల, 5 సిక్సర్లు) శతక్కొట్టుడు, విరాట్‌ కోహ్లి (55 నాటౌట్‌) బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీతో రాణించడంతో భారత్‌ 35 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement