ఐసీసీ, బీసీసీఐలపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు హసన్ రజా సంచలన ఆరోపణలు చేశాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత బౌలర్లకు ప్రత్యేక బంతులు ఇస్తున్నారంటూ ఆరోపించారు.. ఇలా జరగడం వల్లే భారత పేసర్లు ఇతర బౌలర్లతో పోలిస్తే అధిక సీమ్‌ను, స్వింగ్‌ను రాబట్టగలుగుతున్నారని తీవ్రస్థాయి ఆరోపణలు చేశాడు.
ఈ విషయమై సమగ్ర తనిఖీలు జరగడంతో పాటు విస్తృత స్థాయి చర్చ జరగాలని కోరాడు. భారత్-శ్రీలంక మధ్య గురువారం జరిగిన మ్యాచ్ అనంతరం పాక్ టీవీ ఛానల్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా దీటుగా స్పందించాడు. ‘హసన్ రజా మతి ఉండే మాట్లాడుతున్నాడా’ అంటూ స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు. ‘అసలు అతను పాల్గొన్నది సీరియస్ క్రికెట్ షోనేనా’ అని ప్రశ్నించాడు.
Is it a serious cricket show? If not, please mention ‘satire’ ‘comedy’ in English somewhere. I mean…it might be written in Urdu already but unfortunately, I can’t read/understand it. 🙏🏽 https://t.co/BXnmCpgbXy
— Aakash Chopra (@cricketaakash) November 3, 2023
కాగా, హసన్ రజా చేసిన వ్యాఖ్యలను భారత క్రికెట్ అభిమానులు తేలిగ్గా తీసుకుంటున్నారు. కనీస క్రికెట్ పరిజ్ఞానం లేని వ్యక్తి కామెంట్లకు స్పందించడం వేస్ట్ అని అంటున్నారు. జాతీయ జట్టుకు ఆడిన వ్యక్తి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానిస్తున్నారు. కొందరు అభిమానులు హసన్ రజాను క్రికెట్ అజ్ఞాని అని, భారతపై పాక్‌కు ఉన్న అక్కసు అతని మాటల్లో స్పష్టంగా కనబడుతుందని ఏకి పారేస్తున్నారు.
1996-2005 మధ్యలో పాక్ తరఫున ఏడు టెస్ట్‌లు, 16 వన్డేలు ఆడిన హసన్ రజా.. అతిపిన్న వయసులో (14 ఏళ్ల 233 రోజులు) అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
ఇదిలా ఉంటే, శ్రీలంకతో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. మొహమ్మద్ షమీ (5-1-18-5), మొహమ్మద్ సిరాజ్ (7-2-16-3), జస్ప్రీత్ బుమ్రా (5-1-8-1) నిప్పుల వర్షం కురిపించి లంకేయులను కుప్పకూల్చారు. భారత బౌలర్ల ధాటికి ఆ జట్టు 55 పరుగులకే చాపచుట్టేసి 302 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. గిల్ (92), కోహ్లి (88), శ్రేయస్ (82) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment