ప్రపంచ క్రికెట్ చరిత్రలో దురదృష్టవంతమైన జట్లు ఏవైనా ఉన్నాయంటే, అవి న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లే అని చెప్పాలి. ఫార్మాట్ ఏదైనా ఈ రెండు జట్లను దురదృష్టం అనునిత్యం వెంటాడుతూనే ఉంటుంది. మెగా టోర్నీల్లో వీరి బ్యాడ్‌లక్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. విశ్వవేదికపై పోటీపడుతున్నప్పుడు వీరి దురదృష్టం తారాస్థాయిలో ఉంటుంది. నోటి దాకా వచ్చిన విజయాలు, ఆస్వాదించకుండానే చేజారిపోయిన సందర్భాలు కోకొల్లలు.
తాజాగా ఈ రెండు జట్లలో ఓ జట్టైన న్యూజిలాండ్‌కు ఇలాంటి సందర్భం మరోసారి ఎదురైంది. 2023 వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కివీస్ తొలుత బ్యాటింగ్ చేస్తూ 400కు పైగా స్కోర్ చేసినప్పటికీ, వరుణుడు అడ్డుపడటంతో ఓటమిపాలైంది. ఈ ఓటమి కూడా అలాంటి ఇలాంటి ఓటమి కాదు. ఇది ఏకంగా ఆ జట్టు సెమీస్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపే ఓటమి.
తప్పక గెలిచి తీరుతామనుకున్న మ్యాచ్‌లో ఓటమితో పాటు ఒక్కసారిగా సెమీస్ అవకాశాలు సంక్లిష్టం కావడంతో న్యూజిలాండ్ బాధ వర్ణణాతీతంగా ఉంది. ప్రపంచకప్ చరిత్రలో 400కు పైగా స్కోర్ చేసి ఓటమి చవిచూసిన తొలి జట్టు కివీసే కావడం విశేషం.
హాట్ ఫేవరెట్‌లలో ఒకటైన న్యూజిలాండ్ టీమ్ వరుసగా నాలుగు పరాజయాలు మూటగట్టుకుని సెమీస్‌కు చేరకుండానే ప్రపంచకప్ నుంచి నిష్క్రమించే దిశగా సాగుతుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో (8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 0.398) ఉన్న కివీస్ సెమీస్‌కు చేరాలంటే తాము తదుపరి ఆడబోయే మ్యాచ్‌లో భారీ విజయం సాధించడంతో పాటు సెమీస్ రేసులో ఉన్న ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లు తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓడాల్సి ఉంటుంది.
తదుపరి మ్యాచ్‌లో న్యూజిలాండ్ ప్రత్యర్ధి శ్రీలంక కావడం కాస్త ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో శ్రీలంక పేలవ ఫామ్‌లో ఉండటం కివీస్‌కు కలిరావచ్చు. ఒకవేళ ఈ జట్టును ఇక్కడ కూడా దురదృష్టం వెంటాడితే దేవుడు కూడా ఏమీ చేయలేడు. మరోవైపు న్యూజిలాండ్‌తో పాటు సెమీస్ రేసులో ఉన్న పాకిస్తాన్ ఇంగ్లండ్‌ను, ఆఫ్ఘనిస్తాన్.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలను ఎదుర్కోవాల్సి ఉంది.
ఇదిలా ఉంటే, పాక్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కివీస్ 21 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్దతి) ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (95), గ్లెన్ ఫిలిప్స్ (41) విరుచుకుపడటంతో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అనంతరం పాక్ లక్ష్యాన్ని ఛేదించే సమయంలో వర్షం పలు మార్లు అడ్డుపడి న్యూజిలాండ్ ఓటమికి పరోక్ష కారణమైంది. 25.3 ఓవర్ల తర్వాత మొదలైన వర్షం ఎంతకీ ఆగకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతిన పాక్‌ను విజేతగా ప్రకటించారు. ఆ సమయానికి పాక్ వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది. డీఎల్‌ఎస్ ప్రకారం ఈ స్కోర్ న్యూజిలాండ్ స్కోర్ కంటే మెరుగ్గా ఉండటంతో పాక్ విజేతగా నిలిచింది. ఫకర్ జమాన్ (81 బంతుల్లో 126; 8 ఫోర్లు, 11 సిక్సర్లు) అజేయమైన మెరుపు శతకంతో పాక్‌కు జీవం పోశాడు. అతనికి కెప్టెన్ బాబార్ ఆజమ్ (66 నాటౌట్) సహకరించాడు.
Comments
Please login to add a commentAdd a comment