వన్డే ప్రపంచకప్-2023లో నిన్న మరో సంచలనం నమోదైంది. అక్టోబర్ 15న న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌కు పసికూన ఆఫ్ఘనిస్తాన్ ఊహించని షాకివ్వగా.. నిన్న (అక్టోబర్ 17) ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ భీకర ఫామ్‌లో ఉన్న దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (78 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేయగా.. డచ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో సౌతాఫ్రికా 42.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటై ఘెర పరాభవాన్ని మూటగట్టుకుంది.
మ్యాచ్ అనంతరం తామెదుర్కొన్న ఘోర పరాభవంపై సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా స్పందిస్తూ ఇలా అన్నాడు. మొదటిగా నెదర్లాండ్స్‌కు శుభాకాంక్షలు. ఇవాళ వారు అద్భుతంగా ఆడారు. అన్ని విభాగాల్లో మాపై పైచేయి సాధించారు. మా బౌలర్లు డచ్ బ్యాటర్లను 200 స్కోర్‌ను దాటనివ్వాల్సింది కాదు. డచ్ టీమ్ 112 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో మేము మ్యాచ్‌పై పట్టు సాధించాల్సింది. అయితే అలా జరగలేదు. అప్పుడే సగం మ్యాచ్‌ను కోల్పోయాం. అయినా మేము నమ్మకాన్నికోల్పోలేదు.
డచ్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించగలమని భావించాం. అయితే అలా జరగలేదు. డచ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. వారు మాపై ఒత్తిడి తీసుకొచ్చి వికెట్లు కోల్పోయేలా చేశారు. అంతకుముందు శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ల్లో మేం ప్రొఫెషనల్ గేమ్ ఆడాం. అది మా స్థాయి. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మేము మా స్థాయికి తగ్గట్టుగా ఆడలేదు. అందుకే ఓడిపోయాం. మా బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో లోపాలు ఉన్నాయి. అవి డచ్‌తో జరిగిన మ్యాచ్‌లో బయటపడ్డాయి. ఈ రెండు విషయాల్లో మా లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంది. వీటిని అధిగమించి తదుపరి మ్యాచ్‌ల్లో స్థాయికి తగ్గట్టుగా రాణించేందుకు ప్రయత్నిస్తామని బవుమా అన్నాడు.
కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా.. తొలి రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంక, ఆస్ట్రేలియాలపై విజయాలు సాధించి, మూడో మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్ చేతిలో ఓడింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో భారత్, న్యూజిలాండ్ తర్వాత మూడో స్థానంలో కొనసాగుతుంది. ఈ ఎడిషన్‌లో దక్షిణాఫ్రికా తమ తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ముంబై వేదికగా అక్టోబర్ 21న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment