వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ధర్మశాల వేదికగా నిన్న (అక్టోబర్ 17) జరిగిన మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్.. పటిష్టమైన సౌతాఫ్రికాను మట్టికరిపించి, సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో నెదర్లాండ్స్ ఆటగాళ్లు, ఆ దేశ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. భీకర ఫామ్‌లో ఉన్న సౌతాఫ్రికాను ఖంగుతినిపించడంతో డచ్ ఆటగాళ్లు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఈ విజయం వారికి చిరకాలం గుర్తుండిపోతుంది.
ఈ నేపథ్యంలో క్రికెట్ నెదర్లాండ్స్ గురించిన పలు ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఐసీసీ టోర్నీల్లో (2022 టీ20 ప్రపంచకప్, 2023 వన్డే వరల్డ్‌కప్) సఫారీలను రెండుసార్లు మట్టికరిపించిన డచ్ టీమ్ కనీస మౌలిక సదుపాయాలకు కూడా నోచుకోలేదని ప్రచారం జరుగుతుంది. సంచలన ప్రదర్శనలతో చిన్న జట్లకు స్పూర్తిగా నిలుస్తున్న ఆ జట్టు తీవ్రమైన ఆర్ధిక కష్టాలు ఎదుర్కొంటుందని తెలుస్తుంది.
ఆ దేశ క్రికెట్ బోర్డుకు కనీసం డేటా అనలిస్ట్‌ను కూడా నియమించుకునే ఆర్ధిక స్థోమత లేకపోవడంతో పేపర్‌లపై వ్యూహాలు అమలు చేస్తుందని సమాచారం. పరిమిత కిట్‌లు కూడా లేకుండా భారత్‌లో అడుగుపెట్టిన టీమ్ నెదర్లాండ్స్.. ఇక్కడ ప్రాక్టీస్‌లో వారికి సాయపడిన భారత ఆటగాళ్లకు తమ బూట్లు, ఇతర పరికరాలు ఇచ్చి తమ ఉదారతను చాటుకున్నారు. 2020 టీ20 ప్రపంచకప్ వాయిదా పడిన అనంతరం ఎన్నో ఆర్ధిక కష్టాలు ఎదుర్కొన్న డచ్ ఆటగాళ్లు.. పిజ్జా డెలివరీ బాయ్‌లుగా, బార్‌లలో వెయిటర్లుగా చిన్నిచిన్న పనులు చేశారు. ఈ విషయాలను కొందరు డచ్ ఆటగాళ్లు స్వయంగా వెల్లడించారు.
ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ డచ్ ఆటగాళ్లు ఎంతమాత్రం నిరుత్సాహపడకుండా, కేవలం ఆటపై మాత్రమే దృష్టి పెట్టి సంచలనాలు సృష్టిస్తున్నారు. డచ్ టీమ్ కష్టాలు తెలిసి అభిమానులు వీరిని పొగడకుండా ఉండలేకున్నారు. నెదర్లాండ్స్ మున్ముందు మరిన్ని సంచలన విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.
కాగా, డచ్ టీమ్.. క్వాలిఫయర్స్‌లో కూడా ఓ సంచలన విజయం నమోదు చేసి ప్రపంచకప్-2023కు అర్హత సాధించింది. ఆ టోర్నీలో వీరు రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్స్ వెస్టిండీస్‌ను ఖంగుతినిపించారు. తాజాగా హేమాహేమీలతో కూడిన సౌతాఫ్రికాను మట్టికరిపించిన డచ్ టీమ్.. తమను తక్కువ అంచనా వేస్తే ఎంతటి జట్టుకైనా ఇదే గతి పడతుందని హెచ్చరికలు పంపింది.
Comments
Please login to add a commentAdd a comment