
వన్డే ప్రపంచకప్-2023లో పటిష్టమైన సౌతాఫ్రికాపై పసికూన నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించింది. డచ్ టీమ్.. ప్రొటీయాస్‌పై 38 పరుగుల తేడాతో గెలుపొంది, ప్రస్తుత ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని, ఓవరాల్‌గా (ప్రపంచకప్ టోర్నీల్లో) మూడో గెలుపును సొంతం చేసుకుంది.
43 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (78 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేయగా.. డచ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించి సౌతాఫ్రికాను 42.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ చేశారు. దీంతో దక్షిణాఫ్రికా ఘెర పరాభవాన్ని మూటగట్టుకుంది.
మ్యాచ్ అనంతరం తాము సాధించిన చిరస్మరణీయ విజయంపై నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ ఇలా స్పందించాడు. ‘‘చాలా గర్వంగా ఉంది. భీకర ఫామ్‌లో ఉన్న అగ్రశేణి జట్టుపై విజయం సాధించడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. మేము ఇక్కడికి (ప్రపంచకప్) భారీ అంచనాలతో వచ్చాం. అందులో మొదటి మెట్టు ఎక్కాం. ఇంకా సాధించాల్సి ఉంది. లక్ష్యాన్ని చేరుకునేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాం. మాకు చాలా మంచి ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. అందరం కలిసికట్టుగా రాణిస్తే, ప్రస్తుత ప్రపంచకప్‌లో మరిన్ని విజయాలు సాధించగలం. మేము తొలి రెండు మ్యాచ్‌ల్లో కూడా తొలుత మంచి పొజిషన్‌లో ఉన్నాం.
అయితే మ్యాచ్ జరిగే కొద్ది మేము పట్టు కోల్పోయాం. అందుకే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలయ్యాం. ఈ గెలుపును ఇక్కడే వదిలి తదుపరి మ్యాచ్‌లపై దృష్టి సారిస్తాం’’ అని అన్నాడు. కాగా, నెదర్లాండ్స్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయం సాధించి, పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. నెదర్లాండ్స్.. ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల కంటే మెరుగైన స్థితిలో ఉండటం విశేషం. పాయింట్ల పట్టికలో ఆసీస్ తొమ్మిది, శ్రీలంక 10వ స్థానాల్లో ఉన్నాయి. నెదర్లాండ్స్ తమ తదుపరి మ్యాచ్‌లో శ్రీలంకను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో అక్టోబర్ 21న లక్నోలో జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment