ఆసీస్‌ భయంతోనే వార్నర్‌ను ఆడిస్తుందా? | David Warner May Play 3rd Test Even If He Is Not 100 Percent Fit | Sakshi
Sakshi News home page

ఆసీస్‌ భయంతోనే వార్నర్‌ను ఆడిస్తుందా?

Published Thu, Dec 31 2020 5:03 PM | Last Updated on Thu, Dec 31 2020 5:18 PM

David Warner May Play 3rd Test Even If He Is Not 100 Percent Fit - Sakshi

మెల్‌బోర్న్‌ : టీమిండియాతో జరగనున్న మూడో టెస్టులో డేవిడ్‌ వార్నర్‌ 100శాతం ఫిట్‌గా లేకున్నా మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉందని ఆసీస్‌ అసిస్టెంట్‌ కోచ్‌ అండ్రూ మెక్‌డొనాల్డ్‌ అభిప్రాయపడ్డాడు. అయితే మెక్‌డొనాల్డ్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వార్నర్‌ ఫిట్‌నెస్‌పై పలు సందేహాలకు తావిస్తుంది. మొదటి రెండు టెస్టులు చూసుకుంటే ఆసీస్‌ ఆటగాళ్లలో ఏ ఒక్కరు కూడా శతకం సాధించలేకపోయారు.(చదవండి : జహీర్‌ బౌలింగ్‌లో ఆసీస్‌ ఆటగాడు క్లీన్‌బౌల్డ్‌)

ఆసీస్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్న స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్ దారుణమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 1,1*,0,8 పరుగులు చేసి ఘోరంగా విఫలమయ్యాడు. ఆసీస్‌ గెలిచిన మొదటి టెస్టులో బ్యాట్స్‌మెన్ల కన్న బౌలర్ల చలువతోనే గట్టెక్కిందనడంలో సందేహం లేదు. స్మిత్‌ ఒక్కడే కాదు మిగతా ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఈ నేపథ్యంలోనే వార్నర్‌ ఫిట్‌గా లేకున్నా.. అతను జట్టులోకి వస్తే జట్టు బలోపేతం అవుతుందనే సీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

ఒక రకంగా రానున్న మూడు, నాలుగు టెస్టుల్లో బ్యాటింగ్‌ ఇలా కొనసాగితే సిరీస్‌ కోల్పోతామనే భయంతోనే వార్నర్‌ను తుది జట్టులోకి తీసుకొచ్చారని పలువురు భావిస్తున్నారు. వార్నర్‌ రాకతో  జట్టు బలోపేతం అవడం నిజమే అయినా.. ఒక ఆటగాడు ఫిట్‌గా లేకున్నా ఎలా ఆడిస్తారనే దానిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే వార్నర్‌తో పాటు తుది జట్టులోకి రానున్న పుకోవిస్కీ, సీన్‌ అబాట్‌ల ఫిట్‌నెస్‌పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. (చదవండి : డేవిడ్‌ వార్నర్‌ ఇన్‌.. బర్న్స్‌ అవుట్‌)

కాగా భారత్‌తో జరిగిన రెండో వన్డే తర్వాత గజ్జల్లో గాయంతో వార్నర్‌ మూడో వన్డేతో పాటు మూడు టీ20ల సిరీస్‌కు దూరమయ్యాడు. వార్నర్‌ నాలుగు టెస్టుల సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని అంతా భావించినా.. గాయం తగ్గకపోవడంతో తొలి రెండు టెస్టులకు  దూరమయ్యాడు. మూడు, నాలుగు టెస్టులకు గానూ జో బర్న్స్‌ స్థానంలో వార్నర్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇరుజట్ల మధ్య జనవరి 7వ తేదీ నుంచి మూడో టెస్టు మొదలుకానుంది. కరోనా నేపథ్యంలో మూడో టెస్టును సిడ్నీ లేక మెల్‌బోర్న్‌లో జరపాలా అనే దానిపై ఇంకా స్పష్టమైన నిర్ణయం రాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement