పృథ్వీ షా బ్యాట్ జోరు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ తలవంచింది. హైలైట్స్‌ను తలపించేలా సాగిన అతని ఇన్నింగ్స్‌లో కోల్‌కతా బౌలింగ్ దళం కకావికలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ప్రతి పరుగు కోసం చెమటోడిస్తే... అందుకు పూర్తి భిన్నంగా పృథ్వీ ఇన్నింగ్స్ కొనసాగింది. ఒక రకంగా బ్యాటింగ్ ఎలా చెయ్యాలో ప్రత్యర్థి జట్టుకు చూపించినట్లు అతడి ఇన్నింగ్స్ సాగింది. శిఖర్ ధావన్ కూడా రాణించడంతో కోల్‌కతాపై సునాయాస విజయాన్ని నమోదు చేసిన ఢిల్లీ మళ్లీ గెలుపు బాట పట్టింది.
అహ్మదాబాద్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో పరుగు తేడాతో ఎదురైన ఓటమి నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తేరుకుంది. ఆ మ్యాచ్ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగిన ఆ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)పై తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై 7 వికెట్లతో ఢిల్లీ ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 154 పరుగులు చేసింది.
ఆండ్రీ రసెల్ (27 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగగా... శుబ్‌మన్ గిల్ (38 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. లలిత్ యాదవ్ (2/13), అక్షర్ పటేల్ (2/32) బౌలింగ్‌లో రాణించారు. అనంతరం ఛేదనలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పృథ్వీ షా (41 బం తుల్లో 82; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగడంతో మరో 21 బంతులు మిగిలి ఉండగానే... ఢిల్లీ 16.3 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 156 పరుగులు చేసి గెలుపొందింది. శిఖర్ ధావన్ (47 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ప్యాట్ కమిన్స్ (3/24) మినహా కేకేఆర్ బౌలర్లలో ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
ఆడుతూ పాడుతూ...
ఛేజింగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎక్కడా తడబడలేదు. ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్‌లు కోల్‌కతా బౌలర్లను తేలికగా ఎదుర్కొంటూ పరుగులను రాబట్టారు. ముఖ్యంగా పృథ్వీ ఆకాశమే హద్దుగా ఆడాడు. శివమ్ మావి వేసిన తొలి ఓవర్లో 24 పరుగులు బాదిన అతను... క్రీజులో ఉన్నంతసేపు తన బ్యాట్‌కు విశ్రాంతి ఇవ్వలేదు. పృథ్వీ షా దెబ్బకు శివమ్ మావికి తొలి ఓవరే చివరి ఓవర్ అయింది. ధావన్ దూకుడుగా ఆడకపోయినా పృథ్వీకి సహకరిస్తూ తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. వీరి ధాటికి పవర్‌ప్లేలో ఢిల్లీ 67 పరుగులు చేయగా... ఇందులో పృథ్వీ సాధించినవి 48 కావడం విశేషం. ఇదే దూకుడులో అతను 18 బంతుల్లో ఆర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
ఈ సీజన్‌లో ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. పృథ్వీ 55 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను లాంగాఫ్ బౌండరీ లైన్ దగ్గర ఉన్న గిల్ అందుకోవడంలో విఫలమయ్యాడు. ఆ బంతి కాస్తా అతడి చేతులను తాకుతూ బౌండరీ లైన్ ఆవల పడటంతో సిక్సర్ లభించింది. అనంతరం అర్ధ సెంచరీ చేసేలా కనిపించిన ధావన్‌ను కమిన్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో 132 పరుగుల వద్ద ఢిల్లీ తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాతి ఓవర్లో ఫోర్, సిక్సర్ కొట్టి సెంచరీకి చేరువైన పృథ్వీ షాను కూడా కమిన్స్ అవుట్ చేశాడు. పంత్ (8 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. అప్పటికే ఢిల్లీ విజయానికి చేరువగా రావడంతో మిగిలిన పనిని స్టొయినిస్ (3 బంతుల్లో 6 నాటౌట్; 1 ఫోర్) పూర్తి చేశాడు.
శుబ్‌మన్ గిల్ మినహా
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ పరుగుల కోసం తీవ్రంగా శ్రమించింది. ఒక ఫోర్, సిక్సర్ కొట్టి దూకుడు మీద కనిపించిన ఓపెనర్ నితీశ్ రాణా (15) భారీ షాట్‌కు ప్రయత్నించి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. ఈ ఐపీఎల్‌లో పేలవ ఫామ్ తో సతమతమవుతున్న గిల్ కొన్ని చూడచక్కని షాట్లతో అలరించాడు. ఇషాంత్ వేసిన 6వ ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన గిల్... అక్షర్ బౌలింగ్‌లో మిడ్‌వికెట్ మీదుగా సిక్సర్ బాదాడు. మరో ఎండ్‌లో రాహుల్ త్రిపాఠి (17 బంతుల్లో 19; 2 ఫో ర్లు) కూడా నిలకడగా ఆడాడు.
అయితే స్టొయినిస్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన త్రిపాఠి... ఆ తర్వాతి బంతికే డీప్ కవర్‌లో లలిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కెప్టెన్ మోర్గాన్ (0), సునీల్ నరైన్ (0)లను ఒకే ఓవర్లో లలిత్ అవుట్ చేయడంతో కేకేఆర్ పరిస్థితి మరింత దిగజారింది. 15 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా స్కోరు 95/5. ఈ స్థితిలో రసెల్ చెలరేగిపోయాడు. అప్పటి వరకు 14 బంతుల్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసిన అతను... చివరి ఐదు ఓవర్లలో దూకుడుగా ఆడాడు. రబడ వేసిన 18వ ఓవర్లో 4, 6, 6 బాదాడు. 20వ ఓవర్ చివరి బంతికి మరో సిక్సర్ కొట్టి ఇన్నింగ్స్‌ను ముగించాడు.
4, 4, 4, 4, 4, 4
ఛేదనలో పృథ్వీ షా అద్భుత బ్యాటింగ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన శివమ్ మావికి ఫోర్ల రుచి చూపించాడు. వరుసగా ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు బాది 24 పరుగులను పిండుకున్నాడు. ఈ ఓవర్ తొలి బంతిని మావి వైడ్‌గా వేయగా...ఆపై వరుసగా ఆరు బంతుల్లో షా జోరు సాగింది. దాంతో ఢిల్లీకి మొత్తం 25 పరుగులు లభించాయి. ఐపీఎల్‌లో ఓకే ఓవర్లో ఆరు ఫోర్లు కొట్టిన రెండో ప్లేయర్‌గా పృథ్వీ షా నిలిచాడు. గతంలో అజింక్య రహానే ఈ ఘనతను సాధించాడు. 2012 ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన రహానే... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ శ్రీనాథ్ అరవింద్ వేసిన ఓవర్లో ఆరు బంతుల్లో వరుసగా ఆరు ఫోర్లు కొట్టాడు.
స్కోరు వివరాలు
కోల్‌కతా ఇన్నింగ్స్: రాణా (స్టంప్డ్) పంత్ (బి) అక్షర్ 15; గిల్ (సి) స్మిత్ (బి) అవేశ్ 43; త్రిపాఠి (సి) లలిత్ (బి) స్టొయినిస్ 19; మోర్గాన్ (సి) స్మిత్ (బి) లలిత్ 0; నరైన్ (బి) లలిత్ 0; రసెల్ (నాటౌట్) 45; కార్తీక్ (ఎల్బీ) (బి) అక్షర్ 14; కమిన్స్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–25, 2–69 3–74, 4–74, 5–82, 6–109,
బౌలింగ్: ఇషాంత్ 4–0–34–0, రబడ 4–0–31–0, అక్షర్ 4–0–32–2, అవేశ్ 4–0–31–1, లలిత్ 3–0–13–2, స్టొయినిస్ 1–0–7–1.
ఢిల్లీ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) రాణా (బి) కమిన్స్ 82; ధావన్ (ఎల్బీ) (బి) కమిన్స్ 46; పంత్ (సి) మావి (బి) కమిన్స్; స్టొయినిస్ (నాటౌట్) 6; హెట్‌మైర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (16.3 ఓవర్లలో 3 వికెట్లకు) 156. వికెట్ల పతనం: 1–132, 2–146, 3–150.
బౌలింగ్: శివమ్ మావి 1–0–25–0, వరుణ్ చక్రవర్తి 4–0–34–0, ప్రసిధ్ 3.3–0–36–0, నరైన్ 4–0–36–0, కమిన్స్ 4–0–24–3.
Comments
Please login to add a commentAdd a comment