షాంఘై (చైనా): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్ పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాధవ్‌లతో కూడిన భారత బృందం గురువారం జరిగిన సెమీఫైనల్లో 5–1 (55–54, 55–55, 56–55)తో ఇటలీ జట్టును ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రస్తుత ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ జట్టు దక్షిణ కొరియాతో టీమిండియా తలపడుతుంది.
తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన భారత జట్టు రెండో రౌండ్‌లో 5–3 (55–56, 54–54, 55–51, 55–53)తో ఇండోనేసియాపై, క్వార్టర్ ఫైనల్లో 5–1 (59–54, 56–55, 55–55)తో స్పెయిన్‌పై విజయం సాధించింది. దీపిక కుమారి, అంకిత, భజన్ కౌర్‌లతో కూడిన భారత మహిళల రికర్వ్ జట్టు కథ రెండో రౌండ్‌లోనే ముగిసింది. రెండో రౌండ్‌లో భారత్ 3–5 (50–50, 55–49, 51–54, 52–54)తో మెక్సికో జట్టు చేతిలో ఓడిపోయింది.
సెమీఫైనల్లో జ్యోతి సురేఖ
కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, ప్రియాంశ్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. ఆంధ్రఫ్రదేశ్ అమ్మాయి, ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జ్యోతి సురేఖ రెండో రౌండ్‌లో 147–145తో యువా బేగమ్ (టర్కీ)పై, మూడో రౌండ్‌లో 148–147తో ఆండ్రియా మునోజ్ (స్పెయిన్)పై, క్వార్టర్ ఫైనల్లో 143–142తో అవనీత్ కౌర్ (భారత్)పై గెలుపొందింది.
భారత్‌కే చెందిన ప్రపంచ చాంపియన్ అదితి క్వార్టర్ ఫైనల్లో 142–144తో ఆండ్రియా బెసెరా (మెక్సికో) చేతిలో ఓడిపోయింది. పురుషుల క్వార్టర్ ఫైనల్లో ప్రియాంశ్ 145–145 (10/9)తో ‘షూట్ ఆఫ్’లో బతుహాన్ (టర్కీ)పై నెగ్గాడు. భారత్‌కే చెందిన అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్ తొలి రౌండ్‌లో... ప్రథమేశ్ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment