Ind Vs WI Test Series 2023: ‘‘జట్టు నుంచి నన్నెందుకు తప్పించారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. టీమిండియాలో స్థానం లేనందుకు ఎంతగా నిరాశ చెందానో.. అందుకు గల కారణం తెలియక అంతకంటే ఎక్కువగానే బాధపడుతున్నాను. ఈ విషయం గురించి మేనేజ్‌మెంట్ నుంచి నన్నెవరూ సంప్రదించలేదు.
ప్రతి ఒక్కరి కెరీర్‌లో ఎత్తుపళ్లాలు సహజం. అయితే, ఇలాంటి చేదు అనుభవాలను జీర్ణించుకోవడానికి కాస్త సమయం పడుతుంది. మొదట్లో చాలా బాధపడేవాడిని. కానీ ఇప్పుడిప్పుడే అన్నీ అర్థమవుతున్నాయి. భారత జట్టులో నాకు చోటుందా లేదా అన్న విషయం గురించి ఎక్కువగా ఆందోళన చెందడం లేదు.
ఒత్తిడికి లోనుకావడం లేదు. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ట్రోఫీలు గెలిచే దిశగా ముందుకు సాగడమే నా తక్షణ కర్తవ్యం’’ అని టీమిండియా క్రికెటర్, ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి అన్నాడు. కాకినాడకు చెందిన హనుమ విహారి 2018లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు.
తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ శతకంతో
లండన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ తొలి ఇన్నింగ్స్‌లోనే అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. 2022లో బర్మింగ్‌హాంలో ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్టు తర్వాత హనుమ విహారికి మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కలేదు.
దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నప్పటికీ అతడికి అవకాశాలు కరువయ్యాయి. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో ఛాన్స్ వస్తుందని ఎదురుచూసిన 29 ఏళ్ల విహారికి నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇంటర్వ్యూలో హనుమ విహారీ మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
సౌత్ జోన్ కెప్టెన్‌గా
ఇదిలా ఉంటే.. దులిప్ ట్రోఫీ-2023లో సౌత్ జోన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విహారి జట్టును విజేతగా నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వెస్ట్ జోన్‌తో ఆరంభమైన ఫైనల్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కాగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 16 టెస్టులాడిన హనుమ విహారి 839 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 111.
Comments
Please login to add a commentAdd a comment