నిశాంత్, హర్షిత్
బెంగళూరు: దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో భాగంగా నార్త్ ఈస్ట్ జోన్ జట్టుతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో నార్త్ జోన్ జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 306/6 రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన నార్త్ జోన్ జట్టు 8 వికెట్లకు 540 పరుగులవద్ద డిక్లేర్ చేసింది.
నిశాంత్ సింధు (245 బంతుల్లో 150; 18 ఫోర్లు, 3 సిక్స్‌లు), హర్షిత్ రాణా (86 బంతుల్లో 122 నాటౌట్; 12 ఫోర్లు, 9 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కారు. నిశాంత్‌తో కలిసి హర్షిత్ ఎనిమిదో వికెట్‌కు 104 పరుగులు... సిద్ధార్థ్ కౌల్ (9 నాటౌట్)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 64 పరుగులు జోడించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్త్ ఈస్ట్ జోన్ జట్టు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది.
సెంట్రల్ జోన్‌కు ఆధిక్యం
ఈస్ట్ జోన్ జట్టుతో జరగుతున్న మరో క్వార్టర్ ఫైనల్లో సెంట్రల్ జోన్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఓవరాల్‌గా 124 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు జవాబుగా ఈస్ట్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 42.2 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌటైంది.
సెంట్రల్ జోన్ బౌలర్లలో అవేశ్ ఖాన్, సౌరభ్ కుమార్ మూడు వికెట్ల చొప్పున తీశారు. 60 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన సెంట్రల్ జోన్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 64 పరుగులు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment