
మాస్కో: పిన్న వయసులో అధిక బరువుతో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కి బాల బహుబలిగా పేరు పొందిన ధాంబులత్ ఖటోఖోవ్ మృతి చెందాడు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఈ రష్యా యువ సుమో రెజ్లర్ గత మంగళవారం కన్నుమూశాడు. ఈ విషయాన్ని సుమో రెజ్లింగ్ గవర్నింగ్ బాడీకి చెందిన బెటల్ గుబ్జెవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం 21 ఏళ్ల వయసున్న ఖటోఖోవ్ మరణానికి సంబంధించిన కారణాలను గుబ్జెవ్ వెలువరించలేదు.
రెండేండ్ల వయసులో ఖటోఖోవ్ ఏకంగా 34 కిలోల బరువుతో గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో తన పేరును లిఖించుకున్నాడు. కాగా 7 ఏళ్ల వయసులో 100 కేజీల బరువు పెరిగిన ఖటోఖోవ్ 'బేబి ఎలిఫెంట్' అనే ట్యాగ్‌ను సంపాదించాడు. చిన్న వయసులోనే బాల బాహుబలిగా పేరు పొందిన ఇతను 13 ఏళ్ల వయసులో 180 కిలోల బరువు పెరిగి తన రికార్డును తానే బద్దలు కొట్టాడు.