ఐపీఎల్ ఫ్రాంఛైజీ యజమానులను ఉద్దేశించి టీమిండియా మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లు, కోచ్‌లే జట్టును ముందుకు నడిపిస్తారని.. ఈ విషయంలో ఓనర్ల జోక్యం అనవసమా అంటూ ఘాటుగా విమర్శించాడు.
వ్యాపారవేత్తలు కేవలం లాభనష్టాల గురించే ఆలోచిస్తారని.. అయితే, మైదానంలోనే ఆటగాళ్లను కించపరిచేలా వ్యవహరించడం సరికాదని హితవు పలికాడు. లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన నేపథ్యంలో సెహ్వాగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
కాగా ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కేఎల రాహుల్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలమయ్యాడు. ఫలితంగా రైజర్స్ చేతిలో లక్నో చిత్తుగా ఓడిపోయింది. ఈ క్రమంలో సంజీవ్ గోయెంకా మైదానంలోనే రాహుల్‌తో వాదనకు దిగాడు.
అతడు సర్దిచెప్తున్నా వినిపించుకోకుండా ఆగ్రహం ప్రదర్శించాడు. అదే విధంగా కోచ్ జస్టిన్ లాంగర్ పట్ల కూడా ఇదే తరహాలో వ్యవహరించాడు గోయెంకా. ఈ విషయంపై స్పందించిన సెహ్వాగ్ క్రిక్‌బజ్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
‘‘డ్రెస్సింగ్ రూం లేదంటే ప్రెస్ మీట్ సమయంలోనే ఓనర్లు ఆటగాళ్లతో మాట్లాడాలి. అది కూడా వాళ్లలో స్ఫూర్తి నింపేలా వ్యవహరించాలి గానీ.. ‘‘సమస్య ఏంటి? ఏం జరుగుతోంది?’’ అంటూ మైదానంలోనే ఇలా వ్యవహరించకూడదు.
కోచ్‌లు, కెప్టెన్ జట్టును నడిపిస్తారు. కాబట్టి ఓనర్లు ఆటగాళ్ల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే బెటర్. వాళ్లంతా వ్యాపారవేత్తలు. వాళ్లకు కేవలం లాభం, నష్టం గురించి మాత్రమే తెలుసు.
అయినా ఇక్కడ వారికి ఎలాంటి లాస్ లేదు. 400 కోట్ల రూపాయల వరకు లాభం ఆర్జిస్తున్నారు. అంటే.. ఇక్కడ వాళ్లకు నష్టమేమీ ఉండదు కదా అని అంటున్నా! లాభాలు తీసుకోవడం తప్ప జట్టులో ఏం జరిగినా పట్టించుకునే అవసరం పెద్దగా లేదనే అనుకుంటున్నా. మీరేమైనా చెప్పాలనుకుంటే ఆటగాళ్లను మోటివేట్ చేసేలా ఉండాలి.
ఐపీఎల్‌లో చాలా ఫ్రాంఛైజీలు ఉన్నాయి. ఆటగాడు ఓ జట్టును వీడితే మరో జట్టు అతడిని తీసుకుంటుంది. కీలకమైన ఆటగాడిని కోల్పోతే మీ విజయాల శాతం సున్నా అవుతుంది.
నేను పంజాబ్ జట్టును వీడినపుడు వాళ్లు ఐదో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడూ కనీసం ఐదో స్థానంతో ముగించలేకపోయారు’’ అని సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment