లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకాపై టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లను కించపరిచేలా వ్యవహరించడం సరికాదని విమర్శించాడు. కెప్టెన్ పట్ల బహిరంగంగా అసహనం వ్యక్తం చేయడం సిగ్గు చేటంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఉప్పల్‌లో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సేన నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగలిగింది.
టాపార్డర్ పూర్తిగా విఫలం కాగా ఐదు, ఆరు స్థానాల్లో వచ్చిన నికోలస్ పూరన్(48), ఆరో నంబర్ బ్యాటర్ ఆయుశ్ బదోని(55) అద్భుత ఇన్నింగ్స్ చేయడంతో ఈ మాత్రం పరుగులు రాబట్టింది.
ఇక ఈ మ్యాచ్‌లో రాహుల్ 33 బంతులు ఎదుర్కొని కేవలం 29 పరుగులు మాత్రమే చేశాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ(28 బంతుల్లో 75), ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 89) విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా 9.4 ఓవర్లలోనే పని పూర్తి చేసింది.
ఫలితంగా లక్నో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో లక్నో యజమాని కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై అందరి ముందే సీరియస్ అయ్యాడు. రాహుల్ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా అస్సలు వినిపించుకోలేదు.
ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కాగా.. సంజీవ్ గోయెంకా తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మహ్మద్ షమీ స్పందిస్తూ.. గోయెంకా తీరును తప్పుబట్టాడు.
‘‘ఆటగాళ్లకు ఆత్మ గౌరవం ఉంటుంది. యజమానిగా మీరు కూడా ఒక గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న వ్యక్తి. చాలా మంది మిమ్మల్ని చూసి చాలా విషయాలు నేర్చుకుంటారు.
కెమెరాల ముందు మీరిలా చేయడం నిజంగా సిగ్గు చేటు. ఇది కచ్చితంగా సిగ్గుపడాల్సిన విషయమే. ఒకవేళ మీరు కెప్టెన్‌తో మాట్లాడాలనుకుంటే అందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి.
డ్రెసింగ్‌రూం లేదంటే హోటల్ రూంలో కెప్టెన్‌తో మాట్లాడవచ్చు. కానీ ఇలా అందరి ముందే మైదానంలో ఇలా అరిచేయడం సరికాదు. ఇలా చేయడం ద్వారా ఎర్రకోట మీద జెండా ఎగురవేసినంత గొప్ప ఏమైనా వచ్చిందేంటి?
అతడు కేవలం ఆటగాడే కాదు కెప్టెన్ కూడా! ప్రతిసారి ప్రణాళికలు పక్కాగా అమలు చేయలేకపోవచ్చు. ఆటలో గెలుపోటములు సహజం. అంత మాత్రాన కెప్టెన్ కించపరిచేలా వ్యవహరిస్తారా?
ఇలా చేసి తప్పుడు సందేశం ప్రజల్లోకి వెళ్లేలా చేశారు’’ అంటూ మహ్మద్ షమీ సంజీవ్ గోయెంకా వ్యవహార శైలిపై విరుచుకుపడ్డాడు. కాగా చీలమండ సర్జరీ కారణంగా షమీ(గుజరాత్ టైటాన్స్) ఐపీఎల్-2024 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment