
యూరోపియన్ మహిళల టీ10 లీగ్ 2023లో సంచలనం నమోదైంది. ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ కెప్టెన్ ఐరిస్ జ్విల్లింగ్ 36 బంతుల్లోనే శతక్కొట్టింది. ఈ ఇన్నింగ్స్‌లో జ్విల్లింగ్ 11 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 159 పరుగుల భారీ స్కోర్ చేసింది.
నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో జ్విల్లింగ్ ఒక్కరే మూడొంతుల పరుగులు చేయడం విశేషం. మహిళల క్రికెట్ టీ10 ఫార్మాట్‌లో తొలి సెంచరీ చేసిన క్రికెటర్ జ్విల్లింగే కావడం మరో విశేషం. ఈ మ్యాచ్‌లో జ్విల్లింగ్ ధాటికి ఇద్దరు బౌలర్లు ఓవర్‌కు 23 పరుగుల చొప్పున సమర్పించుకున్నారు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రియా.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసి, 100 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. నెదర్లాండ్స్ బౌలర్లలో డి లాంజ్, రాబిన్ రిజ్కే, హన్నా తలో 2 వికెట్లు పడగొట్టగా.. కార్లిన్ వాన్ ఓ వికెట్ దక్కించుకుంది. ఆస్ట్రియా ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్కరు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. మల్లిక మహదేవ 30 పరుగులు చేసింది. ఆస్ట్రియా ఇన్నింగ్స్‌లో నలుగురు డకౌట్లు అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment