ఢిల్లీ క్యాపిటల్స్‌ హ్యాట్రిక్‌ | WPL 2025: Delhi Capitals Enters Into Finals Third Time In A Row, Check More Details Inside | Sakshi
Sakshi News home page

WPL 2025 Finals: ఢిల్లీ క్యాపిటల్స్‌ హ్యాట్రిక్‌

Published Wed, Mar 12 2025 7:56 AM | Last Updated on Wed, Mar 12 2025 10:46 AM

WPL 2025: Delhi Capitals Enters Into Finals Third Time In A Row

మహిళల ఐపీఎల్‌లో (WPL) ఢిల్లీ క్యాపిటల్స్‌ హ్యాట్రిక్‌ సాధించింది. వరుసగా మూడో సీజన్‌లో ఫైనల్‌కు చేరింది. డబ్ల్యూపీఎల్‌-2025లో టేబుల్‌ టాపర్‌గా నిలువడం ద్వారా ఈ ఘనత సాధించింది. గత రెండు సీజన్లలో ఫైనల్‌కు చేరినా ఢిల్లీకి టైటిల్‌ అందని ద్రాక్షాలానే ఉంది. మెగ్‌ లాన్నింగ్‌ సేన ఈసారైనా టైటిల్‌ నెగ్గుతుందో లేదో చూడాలి. డబ్ల్యూపీల్‌ ప్రారంభం (2023) నాటి నుంచి అద్భుత విజయాలు సాధిస్తూ వస్తున్న ఢిల్లీ.. ఫైనల్లో మాత్రం ప్రత్యర్ధులకు తలోగ్గుతుంది. 

2023 సీజన్‌ ఫైనల్లో ముంబై ఇండియన్స్‌ చేతిలో ఓడిన ఢిల్లీ.. గత సీజన్‌ ఫైనల్లో ఆర్సీబీ చేతిలో చిత్తైంది. ఈసారి ఫైనల్లో ఢిల్లీ ప్రత్యర్థి ఎవరో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాలి. ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌ మధ్య రేపు (మార్చి 13) జరుగబోయే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో విజేతతో ఢిల్లీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది.

కాగా, ప్రస్తుత సీజన్‌లో మెగ్‌ లాన్నింగ్‌ నేతృత్వంలోని ఢిల్లీ జట్టు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి టేబుల్‌ టాపర్‌గా నిలిచి దర్జాగా ఫైనల్‌కు చేరింది. టేబుల్‌ టాపర్‌ అయ్యే అవకాశాన్ని ముంబై ఇండియన్స్‌ తృటిలో కోల్పోయింది. నిన్న (మార్చి 11) జరిగిన చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో ముంబై ఆర్సీబీ చేతిలో ఓడి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. 

ముంబై సైతం 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించినప్పటికీ.. ఆ జట్టు రన్‌రేట్‌ ఢిల్లీ కంటే కాస్త తక్కువగా ఉంది. ఢిల్లీ 0.396 రన్‌రేట్‌ కలిగి ఉండగా.. ముంబై 0.192 రన్‌రేట్‌తో గ్రూప్‌ దశ ముగించింది. నిన్నటి మ్యాచ్‌లో ముంబై ఆర్సీబీ చేతిలో ఓడినప్పటికీ రన్‌రేట్‌ ఇంకాస్త పెంచుకుని ఉంటే ఫైనల్‌కు చేరేది. అక్కడికి మెరుగైన రన్‌రేట్‌ సాధించేందుకు ముంబై తీవ్రంగా పోరాడింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ 199 పరుగులు చేయగా.. ముంబై పరుగుల వేట 188 పరుగుల వద్దే ఆగిపోయింది. ఈ ఎడిషన్‌లో ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన మరో జట్టు గుజరాత్‌ జెయింట్స్‌. గత రెండు సీజన్లలో అట్టడుగు స్థానంలో నిలిచిన గుజరాత్‌.. ఈ సీజన్‌లో అనూహ్య విజయాలు సాధించి ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దక్కించుకుంది. ఈ సీజన్‌లో గుజరాత్‌ 8లో 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.

ఇక డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ.. ఆదిలో అదిరిపోయే విజయాలు సాధించినప్పటికీ ఆతర్వాత వరుసగా ఐదు ఓటములు ఎదుర్కొని ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. నిన్న ముంబైతో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో మంచి స్కోర్‌ చేసి గెలవడంతో ఆర్సీబీ నాలుగో స్థానాన్నైనా దక్కించుకోగలిగింది. ఈ మ్యాచ్‌లో ఓడినా లేక నామమాత్రంగా గెలిచినా ఈ సీజన్‌లో ఆర్సీబీ ఆఖరి స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చేది. 

ఈ సీజన్‌లో ఆ జట్టు ఎనిమిదింట మూడు విజయాలు సాధించింది. యూపీ వారియర్జ్‌ విషయానికొస్తే.. ఈ జట్టు గత రెండు సీజన్ల లాగే ఈ సీజన్‌లోనూ నామమాత్రపు ప్రదర్శనలు చేసి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. యూపీ ఈ సీజన్‌లో ఆర్సీబీ లాగే 8 మ్యచ్‌ల్లో 3 గెలిచి చివరి స్థానంలో నిలిచింది. యూపీతో పోలిస్తే ఆర్సీబీ రన్‌రేట్‌ కాస్త మెరుగ్గా ఉంది. మార్చి 15న ముంబైలోని బ్రబోర్న్‌ స్టేడియంలో జరిగే ఫైనల్లో ఢిల్లీ.. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో విజేతతో తలపడుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement