
ఫిఫా వరల్డ్‌కప్-2022లో తమ ఆరంభ మ్యాచ్‌లో ఐరాన్ జట్టు.. ఇంగ్లండ్ చేతిలో 6-2 గోల్స్ తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఐరాన్.. పటిష్టమైన ఇంగ్లండ్‌ను సమర్ధవంతంగా ఢీకొట్టినప్పటికీ, ప్రత్యర్ధిని నిలువరించడంలో విఫలమైంది. ఈ మ్యాచ్‌లో ఐరాన్ ఓడినా.. ఆ జట్టు కనబర్చిన పోరాటపటిమ అందరినీ ఆకట్టుకుంది. ప్రాంతాలకతీతంగా విశ్వవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు ఐరాన్ ఆటగాళ్లను ప్రశంసించారు.
అయితే, ఇంగ్లండ్‌తో మ్యాచ్ ప్రారంభానికి ముందు ఐరాన్ ఆటగాళ్లు తమ జాతీయ గీతాలాపన చేయకపోవడం పలు వివాదాలకు దారి తీసింది. స్వదేశంలో హిజాబ్ విషయంలో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు మద్దతుగా ఆటగాళ్లు సామూహికంగా జాతీయ గీతాలాపనను బాయ్‌కాట్ చేశారు. ఇందుకు చాలా మంది ఐరాన్ అభిమానులు కూడా మద్దతు తెలిపారు.
అయితే, తమ ఆటగాళ్లు ఇలా ప్రవర్తించడం కొందరు ఐరాన్ అభిమానులకు రుచించలేదు. జాతీయ గీతాన్ని ఆలాపించకపోవడం దేశాన్ని అవమానించినట్లు అని భావించిన వారు ఆటగాళ్లపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కొందరైతే ఇంగ్లండ్ చేతిలో మ్యాచ్ ఓడిపోయాక, ఆటగాళ్లను చంపాలని చూశారని ఐరాన్ మేనేజర్ కార్లోస్ క్విరోజ్ (పోర్చుగల్) ఆరోపించారు.
విషయం ఏదైనప్పటికీ ఆటగాళ్లను చంపాలనుకోవడం దుర్మార్గమైన ఆలోచన అని, దీన్ని నేను పూర్తి ఖండిస్తున్నానని కార్లోస్ అన్నాడు. జట్టుకు మద్దతుగా నిలవడం ఇష్టం లేకపోతే, ఇంటికెళ్లి కూర్చోవాలే కానీ, ఆటగాళ్లను చంపుతామని ప్రకటనలు చేయడం సరికాదని అల్లరి మూకలను హెచ్చరించాడు.