దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ మధ్య తొలి సెమీఫైనల్ నేడు
ఎవరు గెలిచినా తొలిసారి వరల్డ్‌కప్ ‘ఫైనల్’కు
ఉదయం గం. 6 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
తరూబా (ట్రినిడాడ్): ఓ ఆసక్తికర సెమీస్ సమరం, ఓ కొత్త ఫైనలిస్టుకు వేదికైన ఈ ప్రపంచకప్‌లో అటు దక్షిణాఫ్రికా, ఇటు అఫ్గానిస్తాన్ ఎవరు ఫైనల్ చేరతారో గురువారం మధ్యాహ్నంలోపు తెలిసిపోతుంది. మెగా ఈవెంట్‌లోనే మేటి జట్లను తోసిరాజని బాగా ఆకట్టుకున్న ఏకైక జట్టు అఫ్గానిస్తాన్. తమ ఆట ఆషామాషీగా లేదని, సంచలన విజయాలు గాలివాటం కానేకాదని రషీద్ ఖాన్ బృందం నిరూపిస్తోంది.
ఆతిథ్య విండీస్, పటిష్ట న్యూజిలాండ్ ఉన్న గ్రూప్ ‘సి’లో లీగ్ దశనే అఫ్గానిస్తాన్ దాటడం గొప్పనుకుంటే... ‘సూపర్–8’లో ఏకంగా 2021 చాంపియన్ ఆ్రస్టేలియానే కంగుతినిపించడం, బంగ్లాదేశ్‌పై తీవ్ర ఒత్తిడి ఉన్న ఆఖరి మ్యాచ్‌లో పోరాడి గెలవడం క్రికెట్ చరిత్రలోనే నిలిచేలా చేసింది. అఫ్గాన్ సెమీస్ చేరడంతోనే రికార్డుల్లోకెక్కింది. ఇప్పుడు ఫైనల్ చేరి చరిత్ర పుటల్లోకెక్కాలని గట్టి పట్టుదలతో ఉంది.
ఇటు బ్యాటర్లు, అటు బౌలర్లు సమష్టిగా రాణిస్తుండటం అఫ్గాన్ పెను సంచలనాలకు కారణం కాగా... మరోవైపు గట్టి జట్టయిన దక్షిణాఫ్రికా మాత్రం ప్రతి మ్యాచ్‌ను కష్టపడుతూనే గెలుపొందడం విడ్డూరం. నెదర్లాండ్స్‌పై 103 పరుగుల లక్ష్యాన్ని 19వ ఓవర్లో ఛేదించడం, బంగ్లాదేశ్‌పై 4 పరుగులు, నేపాల్‌తో ఒక పరుగు తేడాతో గట్టెక్కడం సఫారీ స్థాయిని తక్కువ చేస్తోంది.
తొలిసారి ప్రపంచకప్‌లో ఆడిన అమెరికాపై 194/4లాంటి భారీస్కోరు చేసినా కేవలం 18 పరుగులతోనే గెలుపొందడం... ఇలా ప్రతీ మ్యాచ్‌లోనూ దక్షిణాఫ్రికా పెద్ద పెద్ద పోరాటాలే చేసింది. ఇలాంటి జట్టుపై జోరుమీదున్న అఫ్గాన్ గెలిస్తే సంచలనమైతే అవుతుందేమో కానీ ఇందులో పెద్ద విశేషమైతే ఉండదు. మొత్తం మీద తొలి ఫైనల్ అవకాశాన్ని ఎవరు దక్కించుకుంటారనేదే ఆసక్తికరంగా మారింది.
జట్లు (అంచనా)
దక్షిణాఫ్రికా: మార్క్‌రమ్ (కెప్టెన్), డికాక్, హెండ్రిక్స్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, జాన్సెన్, కేశవ్, రబాడ, నోర్జే, షమ్సీ.
అఫ్గానిస్తాన్: రషీద్ ఖాన్ (కెప్టెన్), గుర్బాజ్, ఇబ్రహీమ్, అజ్మతుల్లా, గుల్బదిన్, నబీ, కరీమ్, నంగేయలియా, నూర్ అహ్మద్, నవీనుల్ హక్, ఫరూఖీ.
2 దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ఇప్పటి వరకు రెండు టి20 మ్యాచ్‌లు జరగ్గా... రెండింటిలోనూ దక్షిణాఫ్రికానే గెలిచింది. 2010 ప్రపంచకప్‌లో 59 పరుగులతో, 2016 ప్రపంచకప్‌లో 37 పరుగులతో దక్షిణాఫ్రికా నెగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment