విరాట్ కోహ్లి.. ఈ పేరే ఓ సంచలనం.. క్రికెట్ రికార్డుల రారాజుగా.. సమకాలీన ఆటగాళ్లెవరికీ సాధ్యం కాని రీతిలో అసాధారణ, అద్భుత ఫీట్లు నమోదు చేస్తూ ముందుకు సాగుతున్నాడీ రన్‌మెషీన్. టీమిండియా ముఖచిత్రంగా మారి దూకుడైన ఆటకు నిర్వచనం చెబుతూ.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఈ ఢిల్లీ బ్యాటర్.
క్రికెట్ మాత్రమే నీ మొదటి ప్రాధాన్యం కావాలన్న తండ్రి మాటను శిరసా వహిస్తూ.. ఆ మాట చెప్పిన నాన్న ఇక లేరన్న చేదు నిజాన్ని పూర్తిగా జీర్ణించుకోకముందే మైదానంలో దిగి జట్టు ప్రయోజనాల కోసం తపించిన నాటి కుర్ర క్రికెటర్.. ఈరోజు సెంచరీల వీరుడిగా అవతరించాడు.
పదిహేనేళ్ల క్రితం..
సరిగ్గా పదిహేనేళ్ల క్రితం.. ఇదే రోజున.. ఆగష్టు 18, 2008లో శ్రీలంకతో వన్డే మ్యాచ్ సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన కోహ్లి.. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత శిఖరాగ్రాలకు చేరుకున్నాడు. తిరుగలేని బ్యాటర్‌గా ఆకట్టుకోవడమే గాకుండా.. మహేంద్ర సింగ్ ధోని తర్వాత టీమిండియా పగ్గాలు చేపట్టి.. కెప్టెన్‌గానూ తనను తాను నిరూపించుకున్నాడు.
అప్పుడు ట్రోఫీ గెలిచి
ఇక.. అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత్‌ను విజేతగా నిలిపిన కోహ్లి హయాంలో టీమిండియా ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవకపోవడం విచారకరం. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2021 తర్వాత పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన కోహ్లిని వన్డేల్లో కూడా సారథిగా తప్పించిన క్రమంలో.. సౌతాఫ్రికా టూర్ సందర్బంగా టెస్టు ఫార్మాట్ పగ్గాలు కూడా విడిచిపెట్టాడు.
అయితే, బ్యాటర్‌గా కొనసాగుతూ క్లిష్ట పరిస్థితులను అధిగమించి సెంచరీల విషయంలో పూర్వ వైభవం పొందిన కోహ్లి... ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఏకంగా 76 శతకాలు పూర్తి చేసుకున్నాడు. టీమిండియా దిగ్గజం సెంచరీ సెంచరీల రికార్డుకు 24 అడుగుల దూరంలో ఉన్నాడు.
రెండు మెగా ఈవెంట్లు.. కళ్లన్నీ కోహ్లిపైనే
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఆసియా వన్డే కప్, వన్డే వరల్డ్‌కప్ రూపంలో కోహ్లికి అచొచ్చిన 50 ఓవర్ ఫార్మాట్లో రెండు మెగా ఈవెంట్లు వేచి ఉన్నాయి. ఆగష్టు 30- సెప్టెంబరు 17 వరకు ఆసియా కప్, అక్టోబరు 5- నవంబరు 19 వరకు జరుగనున్న ఈ క్రేజీ టోర్నీల్లో కోహ్లి ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి!
ఎల్లప్పుడూ రుణపడి ఉంటా
ఇక అంతర్జాతీయ క్రికెటర్‌గా తన పదిహేనేళ్ల ప్రయాణాన్ని తలచుకుంటూ కోహ్లి చేసిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించిన నాటి ఫొటోను పంచుకున్న కోహ్లి.. ‘‘ఎప్పటికీ కృతజ్ఞుడినై ఉంటాను’’ అని చేతులు జోడించిన ఎమోజీని కోహ్లి జత చేశాడు.
ఇన్‌స్టాలో షేర్ చేసిన ఈ ఫొటో.. వేల సంఖ్యలో కామెంట్లు... లక్షల్లో లైకులతో దూసుకుపోతోంది. కాగా మెల్‌బోర్న్‌లో పాక్‌తో నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో కోహ్లి 53 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచి.. ఆఖరి బంతికి టీమిండియాకు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే.
చదవండి: టీమిండియా క్యాప్ అందుకోవడం ఈజీ అయిపోయింది.. అదే జరిగితే బుమ్రా అవుట్!
Comments
Please login to add a commentAdd a comment