టీమిండియాలో అందరూ తాగేవాళ్లే.. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో సాదాసీదా వ్యక్తి కాదు. 2007-12 మధ్యలో టీమిండియా అత్యుత్తమ స్వింగ్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న యూపీ ఆటగాడు ప్రవీణ్ కుమార్. ఐదేళ్ల పాటు టీమిండియాలో తిరుగులేని బౌలర్‌గా, ఆతర్వాత ఐపీఎల్‌లో అత్యుత్తమ పేసర్‌గా చలామణి అయిన ప్రవీణ్ ఆ తర్వాత వివిధ కారణాల చేత కనుమరుగయ్యాడు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న ప్రవీణ్.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి తన సహచరులపై వివాదాస్పద ఆరోపణలు చేసి వార్తల్లోకెక్కాడు.
లల్లన్‌టాప్ అనే యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రవీణ్ మాట్లాడుతూ.. ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ, నాటి తన టీమిండియా సహచరులు, ప్రత్యేకించి ఓ సీనియర్ ఆటగాడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అలాగే పాకిస్తాన్ ఆటగాళ్లపై కూడా ప్రవీణ్ సంచలన ఆరోపణలు చేశాడు.
టీమిండియాలో చేరిన కొత్తలో పలువురు సీనియర్లు తనను మద్యం సేవించడం మానుకోవాలని సూచించారని ప్రవీణ్ అన్నాడు. తనకున్న మద్యం అలవాటు కారణంగా ఓ సీనియర్ తనను ప్రత్యేకించి బద్నాం చేసేవాడని ఆరోపించాడు. జట్టులో అందరూ తాగేవాళ్లే అయినప్పటికీ తన పేరును మాత్రమే హైలైట్ చేసేవారని వాపోయాడు.
ఐపీఎల్‌లో తనకు కోచింగ్ అవకాశాలు రాకపోవడంపై కూడా ప్రవీణ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాగుతానని సాకుగా చూపి తన సొంత జట్టు ఉత్తరప్రదేశ్ సైతం తనను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రౌండ్‌లో కాని డ్రెస్సింగ్ రూమ్‌లో కాని తాను తాగలేదు కదా అని ఎదురు ప్రశ్నించాడు. సరైన గుర్తింపు లేక, అవకాశాలు రాక, కనీసం పలకరించే వారు లేక ఓ దశలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని తెలిపాడు.
ఐపీఎల్‌లో ఆర్సీబీకి ఆడకపోతే తన కెరీర్‌ను నాశనం చేస్తానని నాటి ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీ వార్నింగ్ ఇచ్చాడని బాంబు పేల్చాడు. తన సొంత పట్టణం మీరట్ అయిన కారణంగా తాను ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడాలనుకున్నానని, అయినా తన అభ్యర్ధనను లలిత్ మోదీ పట్టించుకోకుండా బలవంతంగా ఆర్సీబీతో ఒప్పందం కుదిర్చాడని ఆరోపించాడు.
పాకిస్తాన్ బౌలర్లు ఎక్కువగా బాల్ టాంపరింగ్‌కు పాల్పడేవారని ప్రవీణ్ ఆరోపించాడు. దాదాపుగా ప్రతి బౌలర్ కొద్దోగొప్పో బాల్ టాంపరింగ్ చేస్తాడని, పాక్ బౌలర్లు కాస్త ఎక్కువగా చేసే వారని ప్రవీణ్ అన్నాడు. పాక్ ఆటగాళ్లు పైకి ఒకలా లోపల మరోలా ఉండేవారని, వారు ఎక్కువగా అబద్దాలాడేవారని తెలిపాడు.
37 ఏళ్ల ప్రవీణ్‌కు అప్పట్లో అత్యుత్తమ స్వింగ్ బౌలర్‌గా గుర్తింపు ఉండేది. ప్రవీణ్ టీమిండియా తరఫున 6 టెస్ట్‌లు, 68 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ప్రవీణ్ 112 వికెట్లు పడగొట్టాడు. ప్రవీణ్ ఐపీఎల్‌లో పలు ఫ్రాంచైజీల తరఫున 119 మ్యాచ్‌లు ఆడి 90 వికెట్లు పడగొట్టాడు. ప్రవీణ్ చివరిసారిగా 2017లో ఐపీఎల్‌లో ఆడాడు. ఆతర్వాత అవకాశాలు రాకపోవడంతో అతను క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లో ఉన్నాడు. అతను గత యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందు సమాజ్‌వాది పార్టీలో చేరాడు.
Comments
Please login to add a commentAdd a comment