'Go back and play Ranji...': BCCI wants To: ఇంగ్లండ్‌తో నామమాత్రపు ఐదో టెస్టులో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్ సందర్భంగా నలుగురు యువ ఆటగాళ్లు అరంగేట్రం చేయగా.. మరో ఆటగాడికీ ఛాన్స్ ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అదే విధంగా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తిరిగి జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. కాగా స్వదేశంలో స్టోక్స్ బృందంతో టెస్టు సిరీస్‌ను రోహిత్ సేన ఇప్పటికే 3-1తో కైవసం చేసుకుంది. హైదరాబాద్‌లో ఆరంభ మ్యాచ్‌లో ఓడినా.. విశాఖపట్నం, రాజ్‌కోట్, రాంచిలలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి సొంతగడ్డపై ఈ మేరకు ఆధిపత్యాన్ని చాటుకుంది.
ఇక విశాఖ టెస్టులో మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్.. రాజ్‌కోట్‌లో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్.. రాంచిలో బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ టీమిండియా క్యాపులు అందుకున్నారు. వీరిలో రజత్ పాటిదార్‌కు వరుసగా మూడుసార్లు అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
ఈ సిరీస్‌లో అతడు చేసిన పరుగులు 32,9,5,0,17,0. ఫలితంగా రజత్ పాటిదార్ వైఫల్యాలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఫామ్‌లో లేని ఆటగాడిని జట్టులో కొనసాగించడం ఏమిటనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఐదో టెస్టు నుంచి పాటిదార్‌ను తప్పించాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.
రంజీ ట్రోఫీ 2023-24లో విదర్భతో మధ్యప్రదేశ్ సెమీ ఫైనల్లో ఆడాల్సిందిగా బీసీసీఐ తొలుత ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే, కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్ గురించి స్పష్టత రాకపోవడంతో పాటిదార్ విషయంలో నిర్ణయం మార్చుకున్నట్లు సమాచారం.
అయితే, రాహుల్ రాకపోయినా పాటిదార్‌ను తుదిజట్టు నుంచి తప్పించి.. అతడి స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్‌ను ఆడించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదనపు బ్యాటర్‌గా అతడిని జట్టుతోనే కొనసాగించాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా కర్ణాటక బ్యాటర్ తాజా రంజీ సీజన్‌లో వరుస శతకాలతో ఆకట్టుకున్నాడు. భారత్-ఏ తరఫున కూడా రాణించాడు.
Comments
Please login to add a commentAdd a comment