Manu Bhaker: రూ. 2 కోట్లు ఖర్చు చేశాం.. | Govt Spent Rs 2 Crore On Manu Bhaker Training: Union Minister Mandaviya | Sakshi
Sakshi News home page

Manu Bhaker: రూ. 2 కోట్లు ఖర్చు చేశాం..

Published Mon, Jul 29 2024 12:23 PM | Last Updated on Mon, Jul 29 2024 1:22 PM

Govt Spent Rs 2 Crore On Manu Bhaker Training: Union Minister Mandaviya

ఒలింపిక్‌ పతకం గెలిచిన షూటర్‌ మనూ భాకర్‌కు కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ అభినందనలు తెలిపారు. కఠిన శ్రమతోనే ఆమెకు ఈ ఘనత సాధ్యమైందని ప్రశంసించారు. ‘ఖేలో ఇండియా’లో మనూ భాకర్‌ భాగమైందని.. ఆమె శిక్షణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో భారత్‌ పతకాల ఖాతా తెరిచిన విషయం తెలిసిందే.

భారత్‌ను గర్వపడుతోంది
మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టోల్‌​ విభాగంలో హర్యానాకు చెందిన మనూ భాకర్‌ కాంస్యం గెలిచింది. తద్వారా విశ్వ క్రీడల్లో పతకం గెలిచిన భారత తొలి మహిళా షూటర్‌గా ఆమె చరిత్రకెక్కింది. 22 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించిన మనూపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ స్పందిస్తూ.. ‘‘ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలవడం ద్వారా మనూ భాకర్‌ భారత్‌ను గర్వపడేలా చేసింది. తనను ప్రశంసించిన క్రమంలో.. తానూ ఖేలో ఇండియాలో భాగమయ్యానని ఆమె తెలిపింది. ప్రధాని మోదీ చొరవతో ఖేలో ఇండియా కార్యక్రమం రూపుదిద్దుకుంది.

ఆమె శిక్షణ కోసం రూ. 2 కోట్లు ఖర్చు చేశాం
పాఠశాల స్థాయి నుంచే ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తున్నాం. వారిని మెరికల్లా తీర్చిదిద్దే బాధ్యతను కోచ్‌లకు అప్పగిస్తున్నాం. మనూ భాకర్‌ శిక్షణ కోసం దాదాపు రూ. 2 కోట్లు ఖర్చు చేశాం. ట్రెయినింగ్‌ కోసం ఆమెను జర్మనీ, స్విట్జర్లాండ్‌కు పంపించాం.

తను కోరుకున్న కోచ్‌ను శిక్షకుడిగా నియమించాం. కావాల్సిన ఆర్థిక సహాయం అందించాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా మన క్రీడాకారులకు శిక్షణ ఇప్పిస్తున్నాం. ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో మన వాళ్లు సత్తా చాటుతారని నమ్మకం ఉంది. మన ఆటగాళ్లకు మనం ఎల్లవేళలా మద్దతుగా ఉండాలి. మన అథ్లెట్లు అద్భుతంగా ఆడి పతకాలతో తిరిగి రావాలని ఆశిద్దాం’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్‌లో తలపడుతున్న అథ్లెట్లకు మన్సుఖ్‌ మాండవీయ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

చదవండి: ‘మీ అహానికి అభినందనలు’: నాడు కోచ్‌తో మనూ గొడవ.. శాపం పోయిందంటూ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement