గెలిచే దారిలో ఓటమిని పిలవడం అంటే ఇదే! 19 ఓవర్లలో లక్నో స్కోరు 124/3. ఇంకా 7 వికెట్లున్న జట్టు 6 బంతుల్లో 12 పరుగులు చేస్తే చాలు. పైగా తొలి ఓవర్ నుంచి ఆడుతున్న ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధసెంచరీ చేసి క్రీజులో ఉన్నాడు. ఆఖరి ఓవర్ మొదటి బంతికి 2 పరుగులు కూడా చేశాడు. 5 బంతుల్లో 10 పరుగులు సులభంగానే కనిపించింది. కానీ మోహిత్ శర్మ వేసిన తర్వాతి 2 బంతులు రాహుల్, స్టొయినిస్‌లను బోల్తా కొట్టించాయి. ఇంకో 2 బంతులకు ఆయుశ్ బదోని, దీపక్ హుడా రనౌటయ్యారు. అంతే ఆఖరి బంతి మిగిలుంది కానీ... టైటాన్స్ గెలిచింది! సమీకరణం 1 బంతికి 8 పరుగులు కాగా... మోహిత్ కనీసం ఒక పరుగైనా ఇవ్వలేదు. దీంతో ఎవరూహించని విజయం గుజరాత్ గూటికి చేరింది.
లక్నో: మోహిత్ శర్మ స్వింగ్ (2/17)తో గుజరాత్ టైటాన్స్ కింగ్ అయ్యింది. అనూహ్యంగా ఓటమి కోరల్లోంచి గెలుపు మజిలీకి చేరింది. అలవోకగా గెలవాల్సిన చోట లక్నో సూపర్ జెయింట్స్ వరుస నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు చేజార్చుకొని ఓటమిని పలకరించింది. మొదట గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (50 బంతుల్లో 66; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), వృద్ధిమాన్ సాహా (37 బంతుల్లో 47; 6 ఫోర్లు) రాణించారు.
లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా, స్టొయినిస్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 128 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (61 బంతుల్లో 68; 8 ఫోర్లు) పోరాటం జట్టును గెలిపించలేకపోయింది. మోహిత్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది.
కెప్టెన్ ఇన్నింగ్స్...
సాహాతో శుబ్‌మన్ గిల్ (0) ‘ఇంపాక్ట్’ డకౌటైంది. వన్‌డౌన్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా అండతో సాహా బౌండరీలతో టైటాన్స్ స్కోరును కదిలించాడు. ఈ జోడీ పవర్‌ప్లేలో 40 పరుగులు చేసింది. ఆ తర్వాత అడపాదడపా ఫోర్లతో 10 ఓవర్ల దాకా వికెట్‌ను కాపాడుకున్నారు. జట్టు స్కోరు 72 వద్ద సాహాను కృనాల్ పాండ్యా అవుట్ చేయగా... తర్వాత వచ్చిన అభినవ్ (3), విజయ్ శంకర్ (10) నిరాశపరచడంతో పెద్ద స్కోరేం కాలేదు. ఆఖరి ఓవర్లలో హార్దిక్ భారీ సిక్సర్లతో స్కోరు పెంచే ప్రయత్నం చేశాడు. 44 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న పాండ్యా ఆఖరి ఓవర్లో నిష్క్రమించాడు.
రాహుల్ ఒంటరి పోరాటం...
లక్నో ముందున్న లక్ష్యం 136 పరుగులు. కష్టమైందో... కఠినమైందో కానే కాదు! ఓపెనింగ్ జోడీ కెప్టెన్ రాహుల్, కైల్ మేయర్స్ (19 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) పవర్ ప్లేలోనే 53 పరుగులు చేయడంతో లక్ష్యఛేదన సులువుగా సాగింది. మేయర్స్ తర్వాత కృనాల్ పాండ్యా (23 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) అవుటయ్యేసరికే జట్టు 100 పరుగులను దాటింది.
నికోలస్ పూరన్ (1) విఫలమైనా... రాహుల్ క్రీజును అట్టిపెట్టుకోవడంతో ఎవరికీ ఏ బెంగా లేదు. రాహుల్ 38 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. ఆఖరి ఓవర్‌కు ముందు 124/3 స్కోరుతో లక్నో పటిష్టంగా ఉంది. కానీ ఆ తర్వాతే మోహిత్ చివరి ఓవర్ అనూహ్యంగా సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. కచ్చితత్వం లేని షాట్లతో రాహుల్, స్టొయినిస్ (0)వికెట్లను పారేసుకుంటే... పరుగుల వేటలో ఆయుశ్ బదోని (8), దీపక్ హుడా (2) రనౌటయ్యారు.
స్కోరు వివరాలు
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) హుడా (బి) కృనాల్ 47; గిల్ (సి) బిష్ణోయ్ (బి) కృనాల్ 0; హార్దిక్ పాండ్యా (సి) రాహుల్ (బి) స్టొయినిస్ 66; అభినవ్ (సి) నవీనుల్ హఖ్ (బి) మిశ్రా 3; విజయ్ శంకర్ (బి) నవీనుల్ హఖ్ 10; మిల్లర్ (సి) హుడా (బి) స్టొయినిస్ 6; తెవాటియా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 135. వికెట్ల పతనం: 1–4, 2–72, 3–77, 4–92, 5–132, 6–135. బౌలింగ్: నవీనుల్ హఖ్ 4–0–19–1, కృనాల్ పాండ్యా 4–0–16–2, అవేశ్ ఖాన్ 3–0–21–0, రవి బిష్ణోయ్ 4–0–49–0, స్టొయినిస్ 3–0–20–2, అమిత్ మిశ్రా 2–0–9–1.
లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) జయంత్ (బి) మోహిత్ 68; మేయర్స్ (బి) రషీద్ ఖాన్ 24; కృనాల్ (స్టంప్డ్) సాహా (బి) నూర్ అహ్మద్ 23; పూరన్ (సి) హార్దిక్ (బి) నూర్ అహ్మద్ 1; బదోని (రనౌట్) 8; స్టొయినిస్ (సి) మిల్లర్ (బి) మోహిత్ 0; దీపక్ హుడా (రనౌట్) 2; ప్రేరక్ మన్కడ్ (నాటౌట్) 0; రవి బిష్ణోయ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 128. వికెట్ల పతనం: 1–55, 2–106, 3–110, 4–126, 5–126, 6–127, 7–128. బౌలింగ్: షమీ 3–1–18–0, జయంత్ 4–0–26–0, రషీద్ ఖాన్ 4–0–33–1, మోహిత్ శర్మ 3–0–17–2, నూర్ అహ్మద్ 4–0–18–2, హార్దిక్ పాండ్యా 1–0–7–0, రాహుల్ తెవాటియా 1–0–8–0.
Comments
Please login to add a commentAdd a comment