
‘జంబో’ అనిల్ కుంబ్లే మృదు స్వభావి. బౌలింగ్ తప్ప వేరే ధ్యాస లేదు అతనికి. కానీ అతని నీడన ఎదిగిన ‘టర్బోనేటర్’కు దూకుడెక్కువ. మైదానంలో ఆడతాడు. తిడతాడు. ఇంకెమైనా అంటే చెంప చెళ్లుమనిపిస్తాడు కూడా! అవును భజ్జీ అంతే! తగ్గేదేలే అంటాడు. మనోడైనా... ఇంకెవరైనా... తాడోపేడో తేల్చుకునే రకం.
ఇది ఆట సంగతీ...
మ్యాచ్ ఫిక్సింగ్‌తో మసకబారిన క్రికెట్ తదనంతరం సౌరవ్ గంగూలీ సారథ్యంలో టీమిండియాగా రూపాంతరం చెందుతున్న రోజులవి. అప్పటికే కుంబ్లే టాప్ స్పిన్నర్. అయినప్పటికీ తనదైన శైలి ఆఫ్ స్పిన్‌తో హర్భజన్ ఎదిగాడు. 2001 అతని కెరీర్‌కు బంగారుబాట వేసింది. భారత్‌లో పర్యటించిన ఆస్ట్రేలియా మూడు టెస్టులాడింది. ఈ సిరీస్‌లో భజ్జీ 32 వికెట్లు తీశాడు. ముంబైలో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓడిపోయింది. కోల్‌కతాలో జరిగిన రెండో టెస్టులో వీవీఎస్ లక్ష్మణ్ (281) స్పెషల్ ఇన్నింగ్స్... హర్భజన్ ‘హ్యాట్రిక్’ మాయాజాలంతో టీమిండియా అద్భుత విజయం సాధించింది. సిరీస్‌ను 1–1తో సమం చేసింది. ఆ తర్వాత చెన్నైలో జరిగిన మూడో టెస్టులో భారత్ రెండు వికెట్లతో నెగ్గి సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. 2003లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన జట్టులో హర్భజన్ కీలక ఆటగాడిగా ఉన్నాడు.
మంకీగేట్ కథ...
భారత్ 2008లో ఆసీస్ పర్యటనకెళ్లింది. సిడ్నీలో మ్యాచ్ సందర్భంగా చెలరేగిన జాతి వివక్ష ఆరోపణలు, వివాదం, విచారణ.... తదనంతరం ‘మంకీగేట్’గా క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. భజ్జీ తనను కోతి అన్నాడని జాతి వివక్ష ఆరోపణలు చేశాడని సైమండ్స్ నానాయాగీ చేశాడు. అప్పుడు క్రీజులో ఉన్న సచిన్, జట్టు మేనేజర్‌గా వెళ్లిన ఎంవీ శ్రీధర్, ‘టర్బో’తో పాటు విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. ఆసీస్, భారత్ క్రికెట్ బోర్డుల పరస్పర అంగీకారంతో ఈ కథ ముగిసింది.
అబ్బనీ తియ్యని దెబ్బ!
ఆట... మాట... ఇలా వుంటే అతను కొట్టే దెబ్బ సంగతి మాత్రం స్పీడ్‌స్టర్ శ్రీశాంత్‌కు బాగా ఎరుక. 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభమైంది. తొలి సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు హర్భజన్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌కు శ్రీశాంత్ ఆడారు. నిజానికి వీరిద్దరు ఏడాది క్రితం టి20 ప్రపంచకప్ నెగ్గిన ధోని సేన సభ్యులు. ఇద్దరి మధ్య ఎక్కడ పొరపాటు జరిగిందో కానీ ముంబైపై పంజాబ్ గెలిచాక శ్రీకాంత్ నోరు జారడంతో హర్భజన్ ఆగ్రహంతో అతని చెంప చెళ్లుమనిపించాడు. శ్రీశాంత్ చాలాసేపు వెక్కివెక్కి చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment