బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. దీంతో మొదటి టెస్టులో భారత జట్టుకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహించనున్నాడు. రోహిత్ శర్మ ఇటీవల రెండోసారి తండ్రి అయినందున తన కుటుంబంతో మరింత ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలోనే అతడు పెర్త్ టెస్టుకు దూరమయ్యాడు. హిట్‌మ్యాన్ తిరిగి మళ్లీ అడిలైడ్ వేదికగా జరిగే రెండో టెస్టుకు భారత జట్టుతో కలవనున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొత్తంలో భారత కెప్టెన్‌గా ఒకరే ఉండాలని భజ్జీ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ జట్టులోకి వచ్చినప్పటికి బుమ్రానే కెప్టెన్‌గా కొనసాగించాలని అతడు సూచించాడు.
"రోహిత్ రెండో టెస్టుకు కూడా అందుబాటులో ఉంటాడో లేదో ఇంకా క్లారిటీ లేదు. మొదటి రెండు టెస్టుల్లో భారత్ గెలిస్తే, బుమ్రా కెప్టెన్‌గా కొనసాగాలని భారత అభిమానులందరూ కోరుకుంటారు. ఒకవేళ రెండు గేమ్‌లలో భారత్ ఓడిపోతే రోహిత్ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలని అదే ఫ్యాన్స్ డిమాండ్ చేస్తారు. అభిమానుల మనసు చాలా త్వరగా మారిపోతుంది. నేను ఇప్పుడు సునీల్ గవాస్కర్ సర్ కోసం మాట్లడటం లేదు. నేను సాధారణ ప్రజల అభిప్రాయాన్ని చెబుతున్నా అంతే.
నా వరకు అయితే మొత్తం సిరీస్‌కు ఒక కెప్టెన్ ఉంటే బెటర్ అన్పిస్తోంది. అదే జట్టుకు కూడా మంచిది. అప్పుడు ఒక వేళ ఓడిపోయినా ఎవరూ ప్రశ్నించరు. అదే బుమ్రా కెప్టెన్సీలో గెలిచి, తర్వాత రోహిత్ నాయకత్వంతలో ఓడిపోతే కచ్చితంగా ప్రశ్నల వర్షం కురుస్తోంది" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీ పేర్కొన్నాడు. కాగా ఇంతకుముందు భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా బుమ్రానే సిరీస్ మొత్తానికి కెప్టెన్‌గా ఉండాలని అభిప్రాయపడ్డాడు.
చదవండి: SMT 2024: ముంబై జట్టు ప్రకటన.. పృథ్వీ షా, రహానేలకు చోటు
Comments
Please login to add a commentAdd a comment