
ఐపీఎల్-2023లో బుధవారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన రాజస్తాన్.. సీఎస్‌కే కంచుకోటను బద్దలు కొట్టింది.
ఆఖరి ఓవర్‌లో సీఎస్‌కే విజయానికి 21 పరుగులు అవసరమవ్వగా.. సందీప్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి రాజస్తాన్‌కు సంచలన విజయాన్ని అందించాడు. ధోని స్ట్రైక్‌లో ఉన్నప్పటికీ సందీప్ శర్మ మాత్రం యార్కర్లతో ఎటువంటి అవకాశం ఇవ్వలేదు.
అతడే వరల్డ్ నెం1 బ్యాటర్..
ఇక మెగా ఈవెంట్‌లో అదరగొడుతున్న రాజస్తాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్‌పై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. బట్లర్ వరల్డ్ నెం1 బ్యాటర్ అని భజ్జీ కొనియాడాడు. కాగా బట్లర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడిన జోస్.. 204 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేస్‌లో మూడో స్థానంలో ఉన్నాడు.
"బట్లర్‌ను ఏమని ప్రశంసించాలో కూడా తెలియడం లేదు.. అతడు వైట్‌బాల్ క్రికెట్‌లో అద్భుతమైన ఆటగాడు. అతడు క్రీజును తనకు తగ్గట్టుగా ఉపయోగించుకుంటాడు. జోస్‌కు మంచి బ్యాటింగ్ టెక్నిక్ కూడా ఉంది. స్పిన్నర్లను కూడా అతడు సమర్ధవంతంగా ఎదుర్కొగలడు. నా వరకు అయితే ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో అతడే నెం1 బ్యాటర్ అని" హర్భజన్ స్టార్ క్రికెట్ స్పోర్ట్స్ లైవ్ షోలో పేర్కొన్నాడు. కాగా ప్రపంచ టీ20 క్రికెట్‌ను శాసిస్తున్న బాబర్ ఆజం, సూర్యకుమార్ యాదవ్, కోహ్లి, రిజ్వాన్ పేరులను భజ్జీ ప్రస్తావించకపోవడం గమనార్హం.
చదవండి: IPL 2023: గిల్ క్లీన్ బౌల్డ్.. ప్రీతీ జింటా రియాక్షన్ సూపర్! వీడియో వైరల్