
ICC Player Of The Month For September: సెప్టెంబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులను భారత్, పాక్ ప్లేయర్లు గెలుచుకున్నారు. పురుషుల విభాగానికి సంబంధించి ఈ అవార్డును పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ గెలుచుకోగా.. మహిళల విభాగంలో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ విన్నర్‌గా నిలిచారు.
పురుషుల విభాగంలో రిజ్వాన్‌కు టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్ నుంచి పోటీ ఎదురు కాగా.. మహిళల విభాగంలో హర్మన్.. సహచరి మంధాన, బంగ్లా ప్లేయర్ నిగర్ సుల్తానా నుంచి పోటీ ఎదుర్కొంది. రిజ్వాన్, హర్మన్‌లు ఆయా విభాగాల్లో ప్రత్యర్ధుల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొన్నప్పటికీ.. సెప్టెంబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కారణంగా అవార్డులు వీరినే వరించాయి.
సెప్టెంబర్‌లో వీరి ప్రదర్శన విషయానికొస్తే.. ఈ నెలలో పాక్ ఆటగాడు రిజ్వాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో రిజ్వాన్ పట్టపగ్గాలు లేకుండా రెచ్చిపోయాడు. ఓ పక్క తన సహచరులంతా విఫలమవుతున్నా రిజ్వాన్ ఒక్కడే దాదాపు ప్రతి మ్యాచ్‌లో రాణించి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. గత నెలలో అతనాడిన 10 టీ20ల్లో ఏకంగా 7 అర్ధశతకాలు బాది ఔరా అనిపించాడు.
ఇక హర్మన్ విషయానికొస్తే.. ఈ టీమిండియా క్రికెటర్ గత మాసంలో బ్యాటర్‌గానే కాకుండా కెప్టెన్‌గానూ భారీ సక్సెస్ సాధించింది. అలాగే ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్న తొలి భారత మహిళా క్రికెటర్‌గానూ రికార్డుల్లోకెక్కింది. హర్మన్ నేతృత్వంలో టీమిండియా.. ఇంగ్లండ్‌ను తొలిసారి వారి స్వదేశంలో 3-0 తేడాతో (వన్డే సిరీస్) చిత్తు చేసింది. ఈ సిరీస్‌లో ఆమె 103.27 సగటున 221 స్ట్రయిక్ రేట్‌తో 221 పరుగులు చేసింది. ఇందులో ఓ సెంచరీ (143 నాటౌట్), అర్ధసెంచరీ (74 నాటౌట్) ఉన్నాయి.