టీమిండియా స్టార్ పేసర్‌గా నీరాజనాలు అందుకుంటున్న మహ్మద్ షమీ కెరీర్‌లో ఉన్నతస్థితిలో ఉన్నాడు. గాయం వేధిస్తున్నా లెక్కచేయక వన్డే వరల్డ్‌కప్-2023లో అదరగొట్టి.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన ఘనత అతడి సొంతం.
అయితే, చీలమండ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో కొంతకాలంగా ఆటకు దూరమైన అతడు.. సర్జరీ చేయించుకున్నాడు. ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఐపీఎల్-2024 మొత్తానికి అందుబాటులో లేకుండా పోయాడు ఈ గుజరాత్ టైటాన్స్ బౌలర్.
ఇదిలా ఉంటే.. కెరీర్‌పరంగా బాగానే ఉన్న షమీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎప్పుడూ ఏదో ఒక కుదుపు వస్తూనే ఉంది. 2014లో హసీన్ జహానే అనే మహిళను పెళ్లాడాడు షమీ. ఈ జంటకు 2015లో కూతురు ఐరా జన్మించింది.
కానీ.. కొంతకాలం తర్వాత ఈ దంపతుల మధ్య విభేదాలు తలెత్తగా.. భర్తపై సంచలన ఆరోపణలు చేసింది హసీన్. వివాహేతర సంబంధాలు, మ్యాచ్ ఫిక్సింగ్, గృహ హింస అంటూ తీవ్ర ఆరోపణలతో అతడిని సుప్రీంకోర్టు గడప తొక్కించింది. అరెస్టు చేయించాలని చూసింది. అయితే, విచారణ అనంతరం షమీకి ఊరట దక్కింది.
ఈ పరిణామాల నేపథ్యంలో 2018 నుంచి షమీ- హసీన్ విడిగా ఉంటున్నారు. అయితే, తాజాగా మరోసారి షమీని ఉద్దేశించి హసీన్ జహాన్ ఆరోపణలు గుప్పించింది. ‘‘స్టార్ అయిన నా భర్త, అతడి కుటుంబం కారణంగా నేను చేదు అనుభవాలు ఎదుర్కొన్నాను.
న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కానీ ఆమ్రోహా పోలీసులు నన్ను, నా మూడేళ్ల కూతురిని టార్చర్ పెట్టారు. ప్రభుత్వం కూడా నా పట్ల అవమానకరంగా ప్రవర్తించింది. నాకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటోంది’’ అని హసీన్ జహాన్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీరును విమర్శించింది. అంతేకాదు.. మహ్మద్ షమీ యూపీ ప్రభుత్వం, పోలీసులతో కలిసి తనను హత్య చేయించేందుకు కుట్ర చేస్తాడంటూ సంచలన ఆరోపణలు చేసింది.
ఈ నేపథ్యంలో షమీ అభిమానులు హసీన్ జహాన్ తీరుపై మండిపడుతున్నారు. నిరాధార ఆరోపణలు చేస్తూ కాలం గడపటం మానుకుని.. కుమార్తెకు మంచి భవిష్యత్తున్నిచ్చే ఆలోచనలు చేయాలని హితవు పలుకుతున్నారు. అయితే, మరికొంత మంది నెటిజన్లు మాత్రం అనుభవించే వారికి మాత్రమే ఆ బాధ ఏమిటో తెలుస్తుందని హసీన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.
చదవండి: ధోని ఆటగాడిగానూ రిటైర్ అయితే బాగుండేది: టీమిండియా మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment