కూతురు ఐరాతో షమీ(పాత ఫొటో)
తన కూతురు ఐరాను చాలా మిస్సవుతున్నానంటూ టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఉద్వేగానికి లోనయ్యాడు. హసీన్ జహాన్ అనుమతించినపుడు మాత్రమే బిడ్డను చూసుకునే అవకాశం వస్తుందని పేర్కొన్నాడు. ఐరా తల్లితో తనకు విభేదాలు ఉన్నా.. సొంత రక్తాన్ని మాత్రం వదులుకోలేనని ఎమోషనల్ అయ్యాడు.
కాగా మోడల్ హసీన్ జహాన్‌ను 2014లో వివాహం చేసుకున్నాడు షమీ. ఈ దంపతులకు 2015లో కుమార్తె ఐరా జన్మించింది. అయితే, కొన్నేళ్ల క్రితం భర్త షమీపై సంచలన ఆరోపణలు చేస్తూ హసీన్ జహాన్ కోర్టును ఆశ్రయించింది.
షమీ స్త్రీలోలుడని.. అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. అదే విధంగా గృహహింస చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరగా విడిగా ఉంటున్నారు.
కుమార్తె ఐరాను హసీన్ తనతో పాటు తీసుకువెళ్లడంతో.. షమీ కూతురికి కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా న్యూస్18తో సంభాషణ సందర్భంగా.. కూతురి ప్రస్తావన రాగా షమీ స్పందించాడు.
‘‘ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల్ని మిస్సవుతారు కదా! కొన్నిసార్లు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. నేను నా కూతుర్ని మిస్సవుతున్నా. ఎంతైనా తను నా రక్తం. వాళ్ల అమ్మతో విభేదాలున్నంత మాత్రాన నా కూతురిని నేను దూరం చేసుకోలేను. అయితే, నేను ఐరాతో మాట్లాడాలా? వద్దా అనేది వాళ్ల అమ్మ నిర్ణయానుసారమే ఉంటుంది.
తను అనుమతిస్తేనే నేను ఐరాతో మాట్లాడగలను. అయితే, ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా తనను నేరుగా కలవలేకపోయాను. తను ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటా’’ అని షమీ ఉద్వేగానికి లోనయ్యాడు.
కాగా వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత.. గాయం కారణంగా మహ్మద్ షమీ.. టీమిండియాకు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తాడని భావించగా ఫిట్‌నెస్ సాధించకపోవడంతో ఇప్పట్లో రీఎంట్రీ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
చదవండి: Ranji Trophy: రీ ఎంట్రీలో టీమిండియా ఓపెనర్ ధనాధన్ శతకం.. ఫోర్ల వర్షం
Comments
Please login to add a commentAdd a comment