
సెలక్షన్ కమిటీ రేసులో ఉన్నారంటూ వార్తలు.. ఖండించిన మాజీ ఆల్‌రౌండర్
BCCI Selection Committee: జాతీయ సీనియర్ సెలక్షన్ కమిటీ పోస్టుకు తాను దరఖాస్తు చేసుకున్నానన్నంటూ వస్తున్న వార్తలపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ హేమంగ్ బదానీ స్పందించాడు. మీడియాలో తన గురించి వస్తున్న కథనాలు అవాస్తవమని కొట్టిపడేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి సెలక్షన్ పానెల్‌లో భాగం కావడం గొప్ప గౌరవమని.. అయితే తాను మాత్రం ప్రస్తుతం ఎలాంటి పోస్టుకు అప్లై చేయలేదని స్పష్టం చేశాడు.
కాగా టీ20 ప్రపంచకప్-2022లోనూ టీమిండియా సెమీస్‌లోనే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా మేజర్ ఈవెంట్లలో భారత జట్టు వైఫల్యం నేపథ్యంలో చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సీనియర్ సెలక్షన్ కమిటీని రద్దు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
కొత్త సెలక్షన్ కమిటీ నియామకం నేపథ్యంలో దరఖాస్తులు స్వీకరించేందుకు నవంబరు 28ని చివరి తేదీగా ప్రకటించింది. ఈ క్రమంలో హేమంగ్ బదానీ కూడా అప్లై చేశారని, అంతేగాక సెలక్షన్ కమిటీ చైర్మన్ రేసులో కూడా ఉన్నాడంటూ అతడి పేరు వార్తల్లో నిలిచింది.
నేనసలు అప్లై చేయలేదు
ఈ విషయంపై స్పందించిన హేమంగ్ బదానీ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. ఈ మేరకు.. ‘‘నా అభిమానులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు.. మీ అందరికీ ఓ విషయంలో స్పష్టతనివ్వాలనుకుంటున్నాను.
బీసీసీఐ సెలక్షన్ ప్యానెల్‌లో సభ్యుడిగా ఉండటం గొప్ప గౌరవం. అయితే, మీడియాలో వార్తలు వస్తున్నట్లుగా నేను సెలక్షన్ కమిటీ పోస్టుకు దరఖాస్తు చేయలేదు. అప్లై చేసుకున్న వాళ్లందరికీ ఆల్ ది బెస్ట్’’ అంటూ బుధవారం ట్వీట్ చేశాడు.
కాగా తమిళనాడు ఆల్‌రౌండర్ హేమంగ్ బదానీ.. 2000- 2004 వరకు టీమిండియా తరఫున 4 టెస్టులు, 40 వన్డేలు ఆడాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ వికెట్ కీపర్ నయన్ మోంగియా, లెగ్ స్పిన్నర్ ఎల్ శివరామకృష్ణన్, సలీల్ అంకోలా తదితరులు బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ పోస్టులకు అప్లై చేసుకున్నారు.
చదవండి: IND VS NZ 3rd ODI: చెత్త ఫామ్‌పై ప్రశ్న.. సహనం కోల్పోయిన పంత్
IND vs NZ: అప్పుడు రాయుడు.. ఇప్పుడు సంజూకు అన్యాయం: పాక్ మాజీ క్రికెటర్
🙏🏽🙏🏽 pic.twitter.com/WX2I1vXRxf
— Hemang Badani (@hemangkbadani) November 30, 2022